
టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా కవ్వింపులకు పాల్పడ్డ పాకిస్తాన్ ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చర్యలకు ఉపక్రమించింది. భారతీయల మనోభావాలు దెబ్బతినేలా.. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన సాహిబ్‌జాదా ఫర్హాన్, హ్యారిస్ రవూఫ్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి ఫిర్యాదు చేసింది.
కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా టీ20 కప్-2025 వేదికగా భారత్- పాక్ (IND vs PAK)జట్లు తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. లీగ్ దశలో మ్యాచ్ సందర్భంగానే టీమిండియా తమ వైఖరిని దాయాదికి తెలియజేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది.
రెచ్చగొట్టేలా సెలబ్రేషన్స్
ఇక సూపర్-4 మ్యాచ్‌లోనూ టీమిండియా తన వైఖరిని కొనసాగించింది. అయితే, లీగ్ దశ మ్యాచ్‌లో కాస్త సైలెంట్‌గానే ఉన్నపాక్ ఆటగాళ్లు.. ఈసారి మాత్రం రెచ్చగొట్టేలా కవ్వింపులకు పాల్పడ్డారు. ఓపెనర్ ఫర్హాన్ అర్ధ శతకం పూర్తి చేసుకోగానే.. ఏకే-47 మాదిరి బ్యాట్‌ను ప్రేక్షకుల వైపు ఎక్కుపెట్టి.. కాలుస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు.
పహల్గామ్‌లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను కాల్చి చంపిన ఘటనను ఈ చర్య ద్వారా ఫర్హాన్ మరోసారి గుర్తుచేసినట్లయింది. అయితే, మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ కూడా.. తాను సాధారణంగా హాఫ్ సెంచరీకి సెలబ్రేట్ చేసుకోనని.. ఈసారి మాత్రం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని అనిపించిందని మరోసారి రెచ్చగొట్టాడు.
‘6-0’ సంజ్ఞతో రవూఫ్ కవ్వింపులు
అంతేకాదు.. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా తాను లెక్కచేయనంటూ ఫర్హాన్ అహంకారపూరితంగా మాట్లాడాడు. ఇక హ్యారిస్ రవూఫ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ‘6-0’ సంజ్ఞతో టీమిండియా అభిమానుల వైపు చూస్తూ అతి చేశాడు.

కాగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరిట భారత ఆర్మీ.. ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు బదులుగా పాక్ సైన్యం రంగంలోకి వచ్చి ఎదురుదాడికి ప్రయత్నించగా.. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘటనలో పాక్ ఎయిర్‌బేస్‌లు కూడా ధ్వంసమైనట్లు సమాచారం.
కిక్కురమనలేదు
అయితే, రవూఫ్ మాత్రం పాక్ చెప్పుకొంటున్నట్లుగా.. తాము భారత్‌కు చెందిన ఆరు యుద్ధ విమానాలు కూల్చేశామన్నట్లు ఇలా సైగ చేయడం గమనార్హం. లీగ్ దశలో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఆటలు, రాజకీయం వేరు అంటూ సుద్దులు చెప్పిన పాక్.. సూపర్-4 మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు ఇంత యథేచ్చగా బరితెగించినా కిక్కురమనలేదు.
షాకిచ్చిన బీసీసీఐ
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ.. పాక్ ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీకి ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సాహిబ్‌జాదా ఫర్హాన్, హ్యారిస్ రవూఫ్‌ల నుంచి ఐసీసీ లిఖిత పూర్వక వివరణ అడిగే అవకాశం ఉంది.
విచారణలో భాగంగా వీరిద్దరు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. లీగ్, సూపర్-4 దశలో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.. బుధవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఆసియా కప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.
పాక్ బోర్డు ఓవరాక్షన్
బీసీసీఐ చర్యల నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు కూడా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. లీగ్ దశలో పాకిస్తాన్‌పై తమ విజయాన్ని సూర్య.. పహల్గామ్ బాధితులు, ఆపరేషన్ సిందూర్ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత ఆర్మీకి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి పీసీబీ.. ఐసీసీని ఆశ్రయించినట్లు సమాచారం.
చదవండి: అసలు అక్కడ ఏం ఉంది?: అభిషేక్ శర్మపై గావస్కర్ ‘ఫైర్’