నాలుగో టెస్టు బరిలో ఆస్ట్రేలియా
పరువు కోసం ఇంగ్లండ్ ఆరాటం
ఉదయం 5 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
మెల్‌బోర్న్: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో అదరగొట్టి ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్ చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా జట్టు నేటి నుంచి నాలుగో టెస్టు ‘బాక్సింగ్ డే’ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం చలాయించి నెగ్గిన ఆసీస్ 3–0తో సిరీస్ కైవసం
చేసుకుంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ‘క్లీన్‌స్వీప్’ చేయాలని కంగారూలు భావిస్తుండగా... ‘పోరాడితే పోయేదేమీ లేదు’ అన్న తరహాలో తెగించి ఆడేందుకు ఇంగ్లండ్ సిద్ధమైంది.
గాయం కారణంగా జట్టుకు దూరమైన నాథన్ లయన్ స్థానంలో మరో స్పిన్నర్ టాడ్ మర్ఫీకి బదులుగా ఆ్రస్టేలియా జట్టు అదనపు పేసర్‌కు అవకాశమివ్వనుంది. ‘బాక్సింగ్ డే’ టెస్టు కోసం మెల్‌బోర్న్ స్టేడియం ముస్తాబవగా... పచి్చకతో కూడిన పిచ్ ఆరంభంలో పేసర్లకు సహకారం అందించనుంది. అయితే కాస్త సంయమనం పాటిస్తే ఇక్కడ బ్యాటింగ్ చేయడం పెద్ద కష్టం కాదని రికార్డులు చెబుతున్నాయి.
కమిన్స్‌కు విశ్రాంతినివ్వడంతో మరోసారి స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టును నడిపించిన ఈ స్టార్ బ్యాటర్... రెండింట్లోనూ విజయాలు కట్టబెట్టాడు. ట్రావిస్ హెడ్ మంచి జోరు మీదుండగా... గత మ్యాచ్‌లో అలెక్స్ కేరీ గొప్ప ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. స్మిత్, లబుషేన్, ఉస్మాన్ ఖ్వాజా, వెదరాల్డ్‌తో ఆసీస్ బ్యాటింగ్ బలంగా ఉంది.
ఏడో స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ బ్యాటింగ్‌కు దిగనున్నాడు. పచ్చికతో కూడిన పిచ్‌పై కంగారూలు ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్నారు. ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు దక్కించుకున్న మిచెల్ స్టార్క్ మరోసారి బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు. మికెల్ నెసెర్, బోలాండ్, డగెట్ అతడికి సహకరించనున్నారు.
సమష్టిగా రాణిస్తేనే...
మరోవైపు ఇంగ్లండ్ విషయానికి వస్తే... ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఆ జట్టు... చివరి రెండు మ్యాచ్‌ల్లోనైనా పోరాడాలని భావిస్తోంది. ‘ఆ్రస్టేలియా నుంచి సానుకూల దృక్పథంతో తిరిగి వెళ్లాలనుకుంటున్నాం. సిరీస్ కోల్పోయినప్పటికీ ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తాం’ అని ఇంగ్లండ్ కెపె్టన్ బెన్ స్టోక్స్ అన్నాడు. ‘బాజ్‌బాల్’ ఆటతీరు పెద్దగా ఫలితాన్నివ్వని నేపథ్యంలో మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్ ఎలాంటి ప్రణాళికతో బరిలోకి దిగుతుందో చూడాలి.
మూడో టెస్టుకు ముందు లభించిన విరామంలో బీచ్ రిసార్ట్‌కు వెళ్లిన ఇంగ్లండ్ ఆటగాళ్లు నియంత్రణ కోల్పోయే రీతిలో మద్యం సేవించి వార్తల్లోకెక్కగా... అందులో వైరల్‌గా మారిన బెన్ డకెట్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకముంచింది. ఈ సిరీస్‌లో ఆడిన 6 ఇన్నింగ్స్‌లలో కలిపి డకెట్ 97 పరుగులే చేసినప్పటికీ... మరో మెరుగైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతడినే కొనసాగించాల్సిన పరిస్థితి.
ఇక ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో సిరీస్‌కు దూరం కావడం ఇంగ్లండ్ జట్టును మరింత కష్టాల్లోకి నెట్టింది. అతడి స్థానంలో అట్కిన్సన్ బరిలోకి దిగనున్నాడు. సుదీర్ఘ కెరీర్‌లో ఈ సిరీస్‌లోనే ఆసీస్ గడ్డపై తొలి టెస్టు సెంచరీ నమోదు చేసుకున్న మాజీ కెప్టెన్ జో రూట్... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమవడం సిరీస్ ఫలితంపై ప్రభావం చూపింది. మరి ఎలాంటి ఒత్తిడి లేని ఈ పోరులో క్రాలీ, డకెట్, బెథెల్, రూట్, బ్రూక్, స్టోక్స్, జేమీ స్మిత్‌తో కూడిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ ఏమాత్రం ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరం. బౌలింగ్‌లో కార్స్, జాక్స్ కీలకం కానున్నారు.
4 మెల్‌బోర్న్ మైదానంలో ఆ్రస్టేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ నాయకత్వం వహించిన టెస్టులు. స్మిత్ సారథ్యంలో ఈ వేదికపై ఆ్రస్టేలియా రెండు టెస్టుల్లో నెగ్గి, మరో రెండు టెస్టులను ‘డ్రా’గా ముగించి అజేయంగా ఉంది.
57 మెల్‌బోర్న్ మైదానంలో ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్టులు. 29 టెస్టుల్లో ఆ్రస్టేలియా నెగ్గగా... 20 టెస్టుల్లో ఇంగ్లండ్ గెలిచింది. 8 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి.
117 మెల్‌బోర్న్ మైదానంలో ఇప్పటి వరకు ఆ్రస్టేలియా ఆడిన టెస్టులు. ఈ వేదికపై ఆస్ట్రేలియా 68 టెస్టుల్లో గెలిచి, 32 టెస్టుల్లో ఓడిపోయింది. 17 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి.
జట్ల వివరాలు
ఆ్రస్టేలియా (అంచనా): స్మిత్ (కెప్టెన్), వెదరాల్డ్, హెడ్, లబుషేన్, ఖ్వాజా, కేరీ, గ్రీన్, నెసెర్, స్టార్క్, డగెట్/జే రిచర్డ్‌సన్, బోలాండ్.
ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్ ), క్రాలీ, డకెట్, బెథెల్, రూట్, బ్రూక్, జేమీ స్మిత్, విల్ జాక్స్, అట్కిన్సన్, కార్స్, టంగ్.


