న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీల్లో పాల్గొనే మహిళా క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీస్థాయిలో వేతనాలు పెంచింది. క్రికెటర్లతో పాటు మ్యాచ్ అఫీషియల్స్‌కు సైతం జీతభత్యాల్ని పెంచింది. ఇప్పుడు చెల్లిస్తున్న దానికి రెట్టింపును మించే విధంగా హెచ్చింపు చేసింది. ఈ మేరకు బోర్డు ఉన్నస్థాయి మండలి అమోదించడంతో పెరిగిన వేతనాల్ని మహిళా క్రికెటర్లు, అఫీషియల్స్ ఈ సీజన్ నుంచే అందుకోనున్నారు.
ఇప్పటివరకు దేశవాళీ టోర్నీలు ఆడే సీనియర్ మహిళా క్రికెటర్లకు రోజుకి రూ. 20 వేలు (రిజర్వ్ ప్లేయర్లకి రూ. 10 వేలు) చొప్పున చెల్లిస్తున్నారు. తాజా వేతన సవరణతో ఏకంగా రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు అందనున్నాయి. అంటే తుది జట్టులో ఆడితే రూ. 50 వేలు, రిజర్వ్ బెంచ్‌లో ఉంటే రూ. 25 వేలు ఇస్తారు.
జాతీయ టి20 టోర్నీల్లో పాల్గొనే అమ్మాయిలకు మ్యాచ్‌కు రూ. 25 వేల చొప్పున (రిజర్వ్ రూ. 12,500) చెల్లించనున్నారు. దీంతో దేశవాళీ టోర్నీలకు సీజన్ ఆసాంతం అందుబాటులో ఉండే ఒక్కో సీనియర్ క్రికెటర్‌కు ఏడాదికి రూ. 12 లక్షల నుంచి 14 లక్షల చొప్పున వేతన భత్యాలు లభిస్తాయని బోర్డు అధికారులు వెల్లడించారు.
జూనియర్లకు ఇలా...
జూనియర్ మహిళా క్రికెటర్ల పంట కూడా పండింది. అండర్–23, అండర్–19 వయో విభాగాల టోర్నీలు ఆడే అమ్మాయిలు రోజుకి రూ. 25 వేలు (రిజర్వ్ రూ.12,500) చొప్పున పొందుతారు. దేశవాళీ మ్యాచ్‌లకు ఫీల్డ్ అంపైర్లు, రిఫరీలు, అఫీషియల్స్‌గా పనిచేసే వారికి రూ. 40 వేలు రోజుకు చెల్లిస్తారు.
మ్యాచ్ ప్రాధాన్యతను బట్టి ఈ చెల్లింపు మొత్తం కూడా పెరగనుంది. అంటే నాకౌట్, సెమీఫైనల్స్, ఫైనల్ దశ మ్యాచ్ అధికారులకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు చెల్లిస్తారు. దీనివల్ల రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు ఒక్కో అఫీషియల్‌కు రూ. 1 లక్షా 60 వేలు, నాకౌట్ దశలో అయితే రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు మ్యాచ్ ఫీజుగా అందనుంది.


