అసలు అక్కడ ఏం ఉంది?: అభిషేక్‌ శర్మపై గావస్కర్‌ ‘ఫైర్‌’ | Abhishek Sharma Sister Left Heartbroken By Run Out Gavaskar Slams Him, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

అసలు అక్కడ ఏం ఉంది?: అభిషేక్‌ శర్మపై గావస్కర్‌ ‘ఫైర్‌’

Sep 25 2025 9:56 AM | Updated on Sep 25 2025 11:06 AM

Abhishek Sharma Sister Left Heartbroken By Run Out Gavaskar Slams Him

ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో టీమిండియా యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) మరోసారి అదరగొట్టాడు. సూపర్‌-4లో భాగంగా బంగ్లాదేశ్‌ (IND vs BAN)తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 37 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లతో పాటు ఐదు సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్‌రేటు 202.70.

తొందరపాటు చర్య
క్రీజులో కుదురుకున్న తర్వాత ధనాధన్‌ దంచికొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన అభిషేక్‌ శర్మ.. ఓ దశలో సెంచరీ చేసే దిశగా పయనించాడు. అయితే, తన తొందరపాటు చర్య కారణంగా ఊహించని రీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు.

టీమిండియా ఇన్నింగ్స్‌ పన్నెండో ఓవర్లో బంగ్లా పేసర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ బంతితో బరిలోకి దిగాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఎదుర్కొన్న కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా షాట్‌ కట్‌ చేశాడు. అయితే, అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న రిషాద్‌ హొసేన్‌ వేగంగా స్పందించాడు.

సూర్య చెప్పినా కూడా..
డైవ్‌ కొట్టి మరీ బంతిని ఆపాడు. అయితే, అప్పటికే అభిషేక్‌ శర్మ సింగిల్‌ కోసమని నాన్‌-స్ట్రైకర్‌ పొజిషన్‌ నుంచి ముందుకు కదిలాడు. ఈ విషయాన్ని గమనించిన సూర్య.. అభిషేక్‌ను వెనక్కి వెళ్లమని చెప్పాడు. దీంతో అతడు తిరిగి తన స్థానంలోకి వస్తుండగా.. రిషాద్‌.. బౌలర్‌ ముస్తాఫిజుర్‌ వైపు బంతిని త్రో చేయగా.. అతడు ఒడిసి పట్టాడు.

అక్కకు హార్ట్‌బ్రేక్‌
అభిషేక్‌ క్రీజులోకి వచ్చే కంటే ముందే బంతిని వికెట్లకు గిరాటేయడంతో అతడు రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో అభిషేక్‌ 75 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మైదానంలోని ప్రేక్షకులతో పాటు.. అభి అక్క కోమల్‌ కూడా తీవ్ర నిరాశకు గురైంది.

సెంచరీ చేసే ఛాన్స్‌ మిస్‌.. గావస్కర్‌ ‘ఫైర్‌’
ఇక కామెంటేటర్‌, టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ సైతం.. అభిషేక్‌ శర్మ తొందరపాటు చర్యను విమర్శించకుండా ఉండలేకపోయాడు. ‘‘అసలు అక్కడ పరుగు తీయాల్సిన అవసరమే లేదు. అక్కడ సింగిల్‌కు అసలు ఆస్కారమే లేదు. అసలు అక్కడ ఏం ఉంది?’’ అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

ఫైనల్లో భారత్‌
కాగా అభిషేక్‌ శర్మ అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్‌ నెమ్మదించింది. హార్దిక్‌ పాండ్యా (38) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. అంతకు ముందు మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ 19 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 168 పరుగులు చేయగలిగింది.

అయితే, లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాను భారత బౌలర్లు 127 పరుగులకే ఆలౌట్‌ చేయడంతో.. 41 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఆసియా కప్‌-2025 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. విధ్వంసర బ్యాటింగ్‌తో చెలరేగిన అభిషేక్‌ శర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

 

చదవండి: BCCI: అభిషేక్‌ శర్మకు బంపరాఫర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement