ఫైనల్లో భారత్‌ | India enters final of Asia Cup T20 tournament | Sakshi
Sakshi News home page

ఫైనల్లో భారత్‌

Sep 25 2025 4:14 AM | Updated on Sep 25 2025 7:25 AM

India enters final of Asia Cup T20 tournament

‘సూపర్‌–4’లో వరుసగా రెండో విజయం

41 పరుగులతో బంగ్లాదేశ్‌ చిత్తు

 చెలరేగిన అభిషేక్‌ శర్మ 

 నేడు పాక్‌తో బంగ్లాదేశ్‌ పోరు   

అభిషేక్‌ శర్మ తుఫాన్‌ ఇన్నింగ్స్‌... ఆపై పదునైన బౌలింగ్‌... వెరసి ఆసియా కప్‌ టి20 టోర్నీలో భారత్‌ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్యాటింగ్‌లో కాస్త తడబాటు కనిపించినా, చివరకు బంగ్లాదేశ్‌ను ఓడించడంలో టీమిండియా సఫలమైంది. టోర్నీలో వరుసగా ఐదో మ్యాచ్‌ గెలిచిన మన జట్టు దర్జాగా ఫైనల్లోకి ప్రవేశించింది. 

గత మ్యాచ్‌లో శ్రీలంకపై స్ఫూర్తిదాయ ఆటను కనబర్చిన బంగ్లాదేశ్‌ ఈసారి టీమిండియా ముందు నిలవలేకపోయింది. ఇక భారత్‌తో తుది పోరుతో అమీతుమీ తలపడే జట్టేదో నేడు తేలనుంది. విరామం లేకుండా వరుసగా రెండో రోజు ఆడనున్న బంగ్లాదేశ్‌... పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేతకు ఫైనల్‌ బెర్త్‌ ఖాయమవుతుంది.   

దుబాయ్‌: ఆసియా కప్‌ టి20 టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. ‘సూపర్‌–4’ దశలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 

అభిషేక్‌ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) మరో మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగగా... హార్దిక్‌ పాండ్యా (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్‌), శుబ్‌మన్‌ గిల్‌ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం బంగ్లాదేశ్‌ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. 

సైఫ్‌ హసన్‌ (51 బంతుల్లో 69; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. ఇద్దరు మినహా మిగతా బంగ్లా బ్యాటర్లంతా కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు పడగొట్టగా... బుమ్రా, వరుణ్‌ చెరో 2 వికెట్లు తీశారు.  

మధ్య ఓవర్లలో తడబాటు... 
భారత ఇన్నింగ్స్‌ తొలి మూడు ఓవర్లలో ప్రశాంతత... ఒకే ఒక ఫోర్‌తో 17 పరుగులే వచ్చాయి! 7 పరుగుల వద్ద అభిషేక్‌ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్‌ జాకీర్‌ వదిలేయడం కూడా కలిసొచ్చిoది. అయితే పవర్‌ప్లేలో మిగిలిన 3 ఓవర్లలో అభిషేక్‌ విశ్వరూపం చూపించగా, గిల్‌ కూడా ధాటిని ప్రదర్శించాడు. నసమ్‌ వేసిన నాలుగో ఓవర్లో గిల్‌ వరుసగా 4, 6 కొట్టగా చివరి బంతిని అభిషేక్‌ సిక్స్‌ బాదాడు. 

ముస్తఫిజుర్‌ వేసిన ఐదో ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన అభిషేక్‌...సైఫుద్దీన్‌ వేసిన తర్వాతి ఓవర్లో 4 ఫోర్లు బాదాడు. ఈ మూడు ఓవర్లలో కలిపి 55 పరుగులు రావడంతో పవర్‌ప్లేలో స్కోరు 72 పరుగులకు చేరింది. అయితే పవర్‌ప్లే తర్వాత భారత్‌ అనూహ్యంగా తడబడింది. ఒక వైపు 25 బంతుల్లోనే అభిషేక్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... మరోవైపు ఆరు పరుగుల వ్యవధిలో గిల్, శివమ్‌ దూబే (2) అవుటయ్యారు. జోరు మీదున్న అభిషేక్‌ ఇన్నింగ్స్‌ కూడా దురదృష్టవశాత్తూ రనౌట్‌తో ముగిసింది. 

ముస్తఫిజుర్‌ వేసిన బంతిని సూర్యకుమార్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా ఆడగా... ఫీల్డర్‌ ఆపిన విషయాన్ని గుర్తించని అభిషేక్‌ చాలా ముందుకు దూసుకొచ్చాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసినా లాభం లేకపోగా, అదే ఓవర్లో సూర్య కూడా అవుటయ్యాడు. తిలక్‌ వర్మ (5) విఫలం కాగా, 22 బంతుల పాటు భారత్‌కు బౌండరీనే రాలేదు! ఈ దశలో పాండ్యా దూకుడు జట్టుకు కాస్త మెరుగైన స్కోరును అందించింది. 

అయితే చివరి 11 బంతుల్లో టీమిండియా ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. అక్షర్‌ (15 బంతుల్లో 10) బంతులు వృథా చేయగా... ప్రధాన బ్యాటర్‌ సంజు సామ్సన్‌కు ఆడే అవకాశమే ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది.  

టపటపా... 
ఛేదనలో బంగ్లాదేశ్‌ దూకుడు ప్రదర్శించలేకపోయింది. సైఫ్‌ మినహా ఎవరూ ప్రభావం చూపలేదు. అక్కడక్కడ కొన్ని చక్కటి షాట్లు ఆడినా బ్యాటింగ్‌ బృందం సమష్టిగా విఫలమైంది. ఆరంభంలోనే తన్‌జీద్‌ (1) వెనుదిరగడంతో సైఫ్, పర్వేజ్‌ (21) కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 30 బంతుల్లో 42 పరుగులు జోడించారు. పవర్‌ప్లేలో జట్టు 44 పరుగులు చేసింది. 

అయితే కుల్దీప్‌ తన తొలి ఓవర్లోనే పర్వేజ్‌ను అవుట్‌ చేయడంతో పతనం మొదలైంది. ఆ తర్వాత బంగ్లా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 22 పరుగుల వ్యవధిలో ముగ్గురు ప్రధాన బ్యాటర్లు అవుట్‌ కావడంతో గెలుపుపై జట్టు ఆశలు కోల్పోయింది. మరో ఎండ్‌లో సైఫ్‌ పోరాడినా లాభం లేకపోయింది. 36 బంతుల్లో సైఫ్‌ అర్ధ సెంచరీని అందుకున్నాడు. బంగ్లా 18 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు కోల్పోయింది.

150 అంతర్జాతీయ టి20ల్లో ముస్తఫిజుర్‌ వికెట్ల సంఖ్య. బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షకీబ్‌ అల్‌ హసన్‌ (149)ను అతను అధిగమించాడు.  

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (రనౌట్‌) 75; గిల్‌ (సి) తన్‌జీద్‌ (బి) రిషాద్‌ 29; దూబే (సి) తౌహీద్‌ (బి) రిషాద్‌ 2; సూర్యకుమార్‌ (సి) జాకీర్‌ (బి) ముస్తఫిజుర్‌ 5; పాండ్యా (సి) తన్‌జీద్‌ (బి) సైఫుద్దీన్‌ 38; తిలక్‌ (సి) సైఫ్‌ (బి) తన్‌జీమ్‌ 5; అక్షర్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–77, 2–83, 3–112, 4–114, 5–129, 6–168. బౌలింగ్‌: తన్‌జీమ్‌ 4–0–29–1, నసుమ్‌ 4–0–34–0, ముస్తఫిజుర్‌ 4–0–33–1, సైఫుద్దీన్‌ 3–0–37–1, రిషాద్‌ 3–0–27–2, సైఫ్‌ 2–0–7–0.  

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: సైఫ్‌ హసన్‌ (సి) అక్షర్‌ (బి) బుమ్రా 69; తన్‌జీద్‌ (సి) దూబే (బి) బుమ్రా 1; పర్వేజ్‌ (సి) అభిషేక్‌ (బి) కుల్దీప్‌ 21; తౌహీద్‌ (సి) అభిషేక్‌ (బి) అక్షర్‌ 7; షమీమ్‌ (బి) వరుణ్‌ 0; జాకీర్‌ (రనౌట్‌) 4; సైఫుద్దీన్‌ (సి) తిలక్‌ (బి) వరుణ్‌ 4; రిషాద్‌ (సి) తిలక్‌ (బి) కుల్దీప్‌ 2; తన్‌జీమ్‌ (బి) కుల్దీప్‌ 0; నసుమ్‌ (నాటౌట్‌) 4; ముస్తఫిజుర్‌ (సి) అక్షర్‌ (బి) తిలక్‌ 6; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్‌) 127.  వికెట్ల పతనం: 1–4, 2–46, 3–65, 4–74, 5–87, 6–109, 7–112, 8–112, 9–116, 10–127. బౌలింగ్‌: పాండ్యా 2–0–14–0, బుమ్రా 4–0–18–2, వరుణ్‌ 4–0–29–2, కుల్దీప్‌ 4–0–18–3, అక్షర్‌ 4–0–37–1, దూబే 1–0–10–0, తిలక్‌ 0.3–0–1–1.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement