ఇంగ్లండ్‌ హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి! | Ex England Star Calls For Bazball End Ravi Shastri Should Replace McCullum | Sakshi
Sakshi News home page

మెకల్లమ్‌ కాదు!... ఇంగ్లండ్‌ హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి సరైనోడు!

Dec 25 2025 10:22 AM | Updated on Dec 25 2025 11:20 AM

Ex England Star Calls For Bazball End Ravi Shastri Should Replace McCullum

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో ఇంగ్లండ్‌ వైఫల్యాల నేపథ్యంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు టెస్టుల ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ను ఇంగ్లండ్‌ ఇప్పటికే కోల్పోయింది. తమ దేశంలో ‘బజ్‌బాల్‌’ ఆటలు చెల్లవనే రీతిలో కంగారూలు.. స్టోక్స్‌ బృందానికి చెక్‌ పెట్టి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ట్రోఫీని తమ సొంతం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ (Brendon McCullum)ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లూ ఎక్కువవుతున్నాయి. ఈ విషయంపై ఇంగ్లిష్‌ జట్టు మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. మెకల్లమ్‌ స్థానాన్ని భారత మాజీ క్రికెటర్‌, మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri)తో భర్తీ చేయాలని ఇంగ్లండ్‌ బోర్డుకు సూచించాడు.

రవిశాస్త్రి సరైన ఆప్షన్‌
ఈ మేరకు.. ‘‘ఆస్ట్రేలియాను ఓడించగలిగే వ్యూహాలు రచించగల వ్యక్తి ఎవరో మీరు తెలుసుకోవాలి. ఆస్ట్రేలియా జట్టు బలహీనతలు, మానసికంగా, శారీరకంగా వారిని ఎదుర్కోవాలో తెలిసి ఉండాలి. వ్యూహాత్మకంగా వారిని దెబ్బకొట్టగలగాలి. నా అభిప్రాయం ప్రకారం.. ఇంగ్లండ్‌ జట్టు తదుపరి హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి సరైన ఆప్షన్‌’’ అని మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ అభిప్రాయపడ్డాడు.

ఆసీస్‌ గడ్డపై అద్భుతాలు
కాగా టీమిండియా హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి టెస్టు జట్టును విజయపథంలో నడిపించాడు. అతడి మార్గదర్శనంలో భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి, వరుసగా టెస్టు సిరీస్‌లు గెలిచింది. 2018-19, 2020-21 మధ్య కాలంలో ఆసీస్‌ను చిత్తు చేసి.. రెండుసార్లు బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని భారత్‌ సొంతం చేసుకుంది.

ఇక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా.. పెర్త్‌ వేదికగా తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది ఇంగ్లండ్‌. బ్రిస్బేన్‌లో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులోనూ ఇదే చేదు ఫలితాన్ని చవిచూసింది. తాజాగా అడిలైడ్‌ వేదికగా ముగిసిన మూడో టెస్టులో కంగారూల చేతిలో 82 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. వరుసగా రెండోసారి సిరీస్‌ను కోల్పోయింది. ఇరుజట్ల మధ్య బాక్సింగ్‌ డే టెస్టు (డిసెంబరు 26-30)కు మెల్‌బోర్న్‌ వేదిక.

 ‘బజ్‌బాల్‌’ అంటూ
కాగా న్యూజిలాండ్‌ మాజీ బ్యాటర్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ 2022లో ఇంగ్లండ్‌ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ‘బజ్‌బాల్‌’ అంటూ దూకుడైన విధానంతో స్టోక్స్‌ బృందంతో మొదట్లో మెరుగైన ఫలితాలు రాబట్టాడు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇటీవలి కాలంలో ఇంగ్లండ్‌ స్థాయికి తగ్గ ప్రదర్శనలు ఇవ్వడంలో మునుపటి జోరు కొనసాగించలేకపోతోంది.

తాజాగా ప్రతిష్టాత్మక యాషెన్‌ సిరీస్‌ను కోల్పోయి విమర్శలపాలైంది. ఇదిలా ఉంటే.. 2025లో ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ హెడ్‌కోచ్‌గానూ మెకల్లమ్‌ బాధ్యతలు చేపట్టాడు. 2027 వరకు అతడికి కాంట్రాక్టు ఉంది. అయితే, ఇంగ్లండ్‌ జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో 44 ఏళ్ల మెకల్లమ్‌ను పదవి నుంచి దించేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.

చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా ఘనత
 క్రికెటర్ల ‘మద్యపానం’పై విచారణ: ఇంగ్లండ్‌ బోర్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement