న్యూయార్క్: వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడాన్ని అనుకూలంగా మార్చుకోవాలని, ఈ పరిణామాన్ని స్వలాభం కోసం వాడుకోవాలని చైనా భావిస్తున్నట్లు అమెరికాకు చెందిన ‘డిపార్టుమెంట్ ఆఫ్ వార్’ వెల్లడించింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌కు వార్షిక నివేదిక సమర్పించింది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించుకోవాలన్నదే చైనా ప్రయత్నమని నివేదికలో ఉద్ఘాటించింది.
భారత్–అమెరికా మధ్య సంబంధాలు బలపడడం, రెండు సన్నిహితంగా కలిసి పనిచేయడం చైనాకు ఎంతమాత్రం ఇష్టం లేదని స్పష్టం చేసింది. ఎల్‌ఏసీ వద్ద సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని, స్నేహపూర్వక సంబంధాలు పునరుద్ధరించుకోవాలని భారత్, చైనాలు ఒప్పందానికి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నేరుగా విమానాలు నడపడం, వీసాలు జారీ చేయడం వంటి అంశాలపై నిర్ణయానికి వచ్చాయి. మొత్తానికి భారత్, చైనా సంబంధాలు పూర్వస్థితికి రావడానికి పరిస్థితులు చాలావరకు మెరుగయ్యాయి. భారత్‌తో వాణిజ్యానికి చైనా ప్రాధాన్యం ఇస్తోంది.
భారత ప్రధాని మోదీ, చైనా అధినేత జిన్‌పింగ్ పలుమార్లు భేటీ అయ్యారు. 2020 జూన్‌లో గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత భారత్, చైనా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సరిహద్దుల్లో ఇరుదేశాల సైన్యం మోహరించింది. ఇరుపక్షాల మధ్య చర్చల అనంతరం ఉద్రిక్తతలు తగ్గిపోవడం మొదలైంది. ఈ పరిణామాలను యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ వార్ తన నివేదికలో విశ్లేషించింది. భారత్‌తో సంబంధాలకు చైనా అమితమైన ఉత్సాహం చూపిస్తోందని.. అదే సమయంలో చైనా చర్యలు, ఉద్దేశాలను భారత్ పూర్తిగా విశ్వసించడం లేదని స్పష్టంచేసింది. 2049 నాటికి ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగాలన్నదే చైనా జాతీయ వ్యూహమని వివరించింది. చైనా వ్యూహంలో తైవాన్‌తోపాటు భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్ కూడా ఉన్నాయని తెలియజేసింది.


