సౌదీ మంచు తుఫాన్ మనకు ముందస్తు హెచ్చరిక
పాఠాలు నేర్వకుంటే ముప్పేనంటున్న పర్యావరణవేత్తలు
ఫక్తు ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో మంచు తుఫాన్. ఎవరూ ఊహించని ఈ పరిణామం ఇప్పుడు గుబులు రేపుతోంది. అంతర్జాతీయంగా పర్యావరణవేత్తల్లో ఇది పెద్ద చర్చకే దారితీసింది. భూ వాతావరణ వ్యవస్థలోనే అవాంఛనీయమైన మౌలిక మార్పులు భారీ స్థాయిలో చోటు చేసుకుంటున్నాయని చెప్పేందుకు ఇది ప్రబల సాక్ష్యమని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీని నుంచి ముఖ్యంగా భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు...
సౌదీ అరేబియాలోని ఉత్తరాది ప్రాంతాలు తాజాగా మంచులో తడిసి ముద్దయిపోయాయి. ముఖ్యంగా టాబుక్, దాని సమీప పర్వత ప్రాంతా లు పూర్తిగా మంచు దుప్పటి కప్పుకున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. ప్రపంచమంతటికీ ఆశ్చర్యం కలిగించేలా అచ్చం శీతల దేశాల్లో మాదిరి పరిస్థితులు నెలకొన్నాయి. మంచుమయంగా మారిన సౌదీ ఎడారుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారా యి. పర్యావరణ మార్పులు ఇంకెంతమాత్రమూ సుదూర, లేదా కాల్పనిక ముప్పు కాదని, అన్ని దేశాలనూ తీవ్రంగా పట్టి పీడించబోతున్న పెను సమస్య అనీ ఈ పరిణామం స్పష్టంగా చాటింది.
విపరీత పరిస్థితులు
వాతావరణ మార్పులు అనగానే కేవలం ఎండ ప్రచండంగా మండిపోయే రోజుల సంఖ్య పెరుగుతుందని చాలామంది భావిస్తారు. వాస్తవానికి చాలాసార్లు అందుకు విరుద్ధంగా జరుగుతుందని సైంటిస్టుల మాట. భూమి వేడెక్కిన కొద్దీ వాతావరణం మరింత తేమను, శక్తిని సంగ్రహిస్తుంది. వాటి దెబ్బకు చిరకాలం స్థిరంగా కొనసాగుతూ వస్తున్న వాతావరణ ధోరణులు కాస్తా గాడి తప్పుతాయి. ఫలితంగా ఇలా అప్పుడే ప్రచండంగా ఎండ, కొద్దికాలానికే విపరీతమైన కుండపోత వానలు, ఆ వెంటనే వణికించే చలి, ఊహించని ప్రాంతాల్లో హిమపాతం... భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లుగా ఈ ధోరణులు పెరిగిపోతున్నాయి.
మనకు వారి్నంగ్ బెల్స్
సౌదీ మంచు తుఫాన్ ఉదంతం నుంచి భారత్ తక్షణం నేర్వాల్సిన పాఠాలు ఉన్నాయి. ఎందుకంటే పర్యావరణ మార్పుల తాలూకు దు్రష్పభావం కొన్నేళ్లు మన దేశంపై తీవ్రంగానే ప్రభావం చూపు తూ వస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కనిపించిన విపరీత వాతావరణ ధోరణులే ఇందుకు రుజువు. తొలుత ఉత్తర, మధ్య భారతంలో రికార్డు స్థాయి ఎండలు కాచాయి. ఆ వెంటనే ఉత్తరాఖండ్ మొద లుకుని హిమాచల్ ప్రదేశ్, సిక్కిం దాకా క్లౌడ్ బరస్ట్ విలయమే సృష్టించింది. చాలా రాష్ట్రాల్లో వర్షాకా లం ఆలస్యంగా వస్తే కొన్నింటిలో విపరీతమైన వరదలు అపార నష్టం కలుగజేశాయి. ఇవేవీ యా దృచ్చిక ఘటనలు కాదు. వాతావరణ వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉండనేందుకు స్పష్టమైన సంకేతాలు.
తక్షణం మేల్కొనాలి
ప్రభుత్వాలు ఇప్పటికీ మేల్కొనకపోతే భారత్‌లో పర్యావరణ వ్యవస్థే పూర్తిగా కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే సాగు సీజన్లు, నీటి యాజమాన్యం, పట్టణ ప్రణాళికలు మొదలుకుని విద్యుత్ డిమాండ్ దాకా అన్నింటికీ సజావైన వాతావరణ వ్యవస్థే మూలం. అదే దెబ్బ తింటే పంటల వైఫల్యం మొదలుకుని అన్నీ వినాశకర పరిణామాలే తలెత్తుతాయి. దేశవ్యాప్తంగా కాలుష్యాన్ని కట్టడి చేసే చర్యలను చిత్తశుద్ధితో అమలు చేయడం అత్యవసరం. అలాగే వాతావరణానికి తగ్గట్టుగా సాగు పద్ధతులు, ధోరణులను కూడా మార్చుకుంటూ పోవడం ప్రస్తుత అవసరం. లేదంటే పరిస్థితి చూస్తుండగానే చేయి దాటిపోతుంది. అప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


