దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ఆరంభమైన రోజే (బుధవారం) పరుగుల వరద పారింది. ఈ ఎడిషన్‌లోని తొలి మ్యాచ్.. దాదాపు ప్రతీ బౌలర్‌కూ ఓ పీడకలను మిగిల్చింది. రికార్డు స్థాయిలో ఒకేరోజు ఏకంగా 22 శతకాలు నమోదు కావడం.. ఇందులో ఫాస్టెస్ట్ సెంచరీలు ఉండటం ఇందుకు నిదర్శనం.
అయితే, ఇందులో రెండు శతకాలు మాత్రం అత్యంత ప్రత్యేకం. సుమారుగా పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ తరఫున భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) ఈ దేశీ టోర్నీ బరిలో దిగగా.. ముంబై రాజా, టీమిండియా లెజెండరీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా సొంత జట్టు తరఫున రంగంలోకి దిగాడు.
62 బంతుల్లోనే
జైపూర్ వేదికగా సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో సిక్కింతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ శతక్కొట్టాడు. కేవలం 62 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. తన లిస్-ఎ క్రికెట్ కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (Fastest Century) నమోదు చేశాడు. మొత్తంగా 94 బంతుల్లో 155 పరుగులు సాధించాడు. ఇందులో 18 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.
ఇక రోహిత్ అద్భుత ప్రదర్శన కారణంగా సిక్కిం విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని.. ముంబై కేవలం 30.3 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను చూసేందుకు వేలాది మంది అభిమానులు జైపూర్ స్టేడియానికి వచ్చారు.
కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ జరుగుతున్న వేళ కొంతమంది.. టీమిండియా సెలక్టర్ ఆర్పీ సింగ్ స్టేడియంలో ఉండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో.. లక్ష్య ఛేదనలో రోహిత్ మెరుపు శతకంతో చెలరేగడంతో.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎక్కడున్నావు?.. కళ్లప్పగించి చూడు గంభీర్!
‘‘గంభీర్ నువ్వు ఎక్కడున్నావు? మాకైతే కనిపించడం లేదు.. నువ్వేతై కళ్లప్పగించి రోహిత్ ఇన్నింగ్స్ చూడు’’ అంటూ గట్టిగట్టిగా అరిచారు. కాగా వన్డే ప్రపంచకప్-2027 ఆడటంపై స్పష్టత లేదంటూ.. ఇటీవలే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ.
చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సారథిపై వేటు వేసింది. మరోవైపు.. టీమిండియా యువ ఆటగాళ్లతో పాటు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు కూడా దేశీ టోర్నీల్లో ఆడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో రో-కోలను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ వారి అభిమానులు.. సందర్భం వచ్చినపుడల్లా గంభీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరు అదరగొట్టడం.. విజయ్ హజారే ట్రోఫీలోనూ శతకాలు బాదడంతో మరోసారి గంభీర్ ట్రోల్ అవుతున్నాడు.
శతక్కొట్టిన కోహ్లి
కాగా ఆంధ్రతో మ్యాచ్‌లో కోహ్లి 131 పరుగులు సాధించాడు. కోహ్లితో పాటు ప్రియాన్ష్ ఆర్య (74), నితీశ్ రాణా (77) రాణించడంతో ఆంధ్ర విధించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 37.4 ఓవర్లలో ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించింది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పిన రో-కో కేవలం వన్డేలలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
చదవండి: ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు.. షమీకీ ఛాన్స్!


