విజయ్ హజారే ట్రోఫీలో తొలి రోజు శతకాల మోత
బిహార్ 574/6
పురుషుల లిస్ట్ ‘ఎ’క్రికెట్‌లో ప్రపంచ రికార్డు స్కోరు
వైభవ్ సూర్యవంశీ వీరంగం 84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్స్‌లతో 190
32 బంతుల్లోనే సకీబుల్ గనీ రికార్డు సెంచరీ
అరుణాచల్ ప్రదేశ్‌పై 397 పరుగుల తేడాతో బిహార్ గెలుపు
విజయ్ హజారే టోర్నీలో రికార్డుల వెల్లువ
బంతి మీద పగబట్టినట్లు... బౌలర్లతో ఆజన్మ విరోధం ఉన్నట్లు... సింగిల్స్ తీయడమే తెలియదన్నట్లు... బిహార్ బ్యాటర్లు బౌండరీలతో చెలరేగిపోయారు. బంతి ఎక్కడపడ్డా దాన్ని గీత దాటించడమే లక్ష్యంగా అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా విజయ్ హజారే వన్డే టోర్నీలో బిహార్ జట్టు ప్రపంచ రికార్డు స్కోరు నమోదు చేసింది.
14 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రికార్డులు తిరగరాస్తూ త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకోగా... సకీబుల్ గనీ లిస్ట్ ‘ఎ’క్రికెట్‌లో భారత్ తరఫున ‘ఫాస్టెస్ట్ సెంచరీ’ తన పేరిట రాసుకున్నాడు. ఆయుశ్ లొహారుక కూడా శతకంతో విజృంభించడంతో బిహార్ కొండంత స్కోరు చేసింది. ఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ 177 పరుగులకు ఆలౌటై 397 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది.
భారత దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారింది. టోర్నీ తొలి రోజు బుధవారం రికార్డు స్థాయిలో 22 సెంచరీలు నమోదయ్యాయి. సుదీర్ఘ విరామం అనంతరం దేశవాళీల్లో ఆడుతున్న స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి (ఢిల్లీ), రోహిత్ శర్మ (ముంబై) శతకాల మోత మోగిస్తే... బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు.
టి20 ప్రపంచకప్‌నకు ఎంపికైన ఇషాన్ కిషన్ (జార్ఖండ్) మెరుపు సెంచరీతో కదంతొక్కితే... అదే మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ (కర్ణాటక) భారీ శతకంతో చెలరేగాడు. ఒడిశా ప్లేయర్ స్వస్తిక్ సమల్ ఈ టోర్నీ చరిత్రలో ఎనిమిదో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కితే... 32 బంతుల్లోనే సెంచరీ చేసిన బిహార్ కెప్టెన్ సకీబుల్ గనీ లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.
రాంచీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్లేట్ గ్రూప్‌లో భాగంగా బుధవారం జరిగిన పోరులో బిహార్ జట్టు రికార్డుల దుమ్ము దులిపింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (84 బంతుల్లో 190; 16 ఫోర్లు, 15 సిక్స్‌లు), కెప్టెన్ సకీబుల్ గనీ (40 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 12 సిక్స్‌లు), ఆయుశ్ లొహారుక (56 బంతుల్లో 116; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కడంతో మొదట బ్యాటింగ్ చేసిన బిహార్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది.
లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోరు. అనంతరం లక్ష్యఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ 42.1 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి 397 పరుగుల తేడాతో బిహార్‌కు విజయాన్ని అందించారు.
దంచుడే దంచుడు...
మెరుపులా మొదలైన బిహార్ ఇన్నింగ్స్... ఉరుములా ప్రత్యర్థులను భయపెట్టి... తుపానులా చుట్టేసి... చివరకు సునామీలా రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఇప్పటికే సీనియర్ స్థాయిలో భారీ సెంచరీలతో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న బిహార్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ... అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వరుస బౌండరీలతో బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్... ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయాడు.
మరో 11 బంతుల్లోనే 50 పరుగులు జోడించి 36 బంతుల్లో శతకం నమోదు చేసుకున్నాడు. తద్వారా లిస్ట్ ‘ఎ’క్రికెట్‌లో శతకం బాదిన అత్యంత పిన్నవయసు్కడిగా రికార్డు సృష్టించాడు. తొలి వికెట్‌కు 14.3 ఓవర్లలో 158 పరుగులు జతచేసిన వైభవ్... 59 బంతుల్లోనే 150 పరుగుల మార్క్ అందుకొని... డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. డబుల్ సెంచరీకి 10 పరుగుల దూరంలో వైభవ్ అవుటయ్యాడు.
సకీబుల్ విధ్వంసం...
వైభవ్ వెనుదిరగడంతో ఊపిరి పీల్చుకుందాం అనుకున్న అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లకు బిహార్ సారథి సకీబుల్ గనీ పట్టపగలే చుక్కలు చూపించాడు. ప్రతి బంతిని బౌండరీకి తలరించడమే లక్ష్యంగా భారీ షాట్‌లతో పరుగుల వరద పారించాడు.
ఈ క్రమంలో అతడు 32 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని లిస్ట్ ‘ఎ’క్రికెట్‌లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్‌లో 128 పరుగులు చేసి సకీబుల్ బౌండరీల ద్వారానే 112 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో బిహార్ ప్లేయర్లు 49 ఫోర్లు, 38 సిక్స్‌లు బాదారు.
574/6
పురుషుల లిస్ట్ ‘ఎ’ (దేశవాళీ+అంతర్జాతీయ వన్డేలు) క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోరు. 2022–23 విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పైనే తమిళనాడు చేసిన స్కోరు (506/2) రెండో స్థానానికి చేరింది.
1 పురుషుల లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో వేగంగా 150 పరుగులు చేసిన ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. తాజా మ్యాచ్‌లో అతడు 59 బంతుల్లో ఈ మార్క్ అందుకున్నాడు. 2015లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్ 64 బంతుల్లో 150 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.
32 ఈ మ్యాచ్‌లో సకీబుల్ సెంచరీకి తీసుకున్న బంతులు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఓవరాల్‌గా లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీల జాబితాలో మెక్ గుర్క్ (29 బంతుల్లో), డివిలియర్స్ (31 బంతుల్లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
38 ఈ మ్యాచ్‌లో సకీబుల్ సెంచరీకి తీసుకున్న బంతులు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఓవరాల్‌గా లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీల జాబితాలో మెక్ గుర్క్ (29 బంతుల్లో), డివిలియర్స్ (31 బంతుల్లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
1 విజయ్ హజారే టోర్నీలో ఒకే జట్టు తరఫున మూడు సెంచరీలు నమోదవడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో 1995లో హైదరాబాద్‌తో మ్యాచ్‌లో విల్స్ ఎలెవన్ జట్టు తరఫున సచిన్ టెండూల్కర్, గగన్ ఖోడా,
సంజయ్ మంజ్రేకర్ శతకాలు చేశారు.
1 లిస్ట్ ‘ఎ’ క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ (14 సంవత్సరాల 272 రోజులు) రికార్డు నెలకొల్పాడు. జహూర్ ఇలాహీ (15 ఏళ్ల 209 రోజులు; 1986లో పాక్ ఆటోమొబైల్స్ కార్పొరేషన్) పేరిట ఉన్న రికార్డును వైభవ్ తిరగరాశాడు.
ఇటు కోహ్లి... అటు రోహిత్
‘శత’క్కొట్టిన సీనియర్ ప్లేయర్లు
ఆంధ్రపై ఢిల్లీ; సిక్కింపై ముంబై గెలుపు
బెంగళూరు: స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సెంచరీలతో కదంతొక్కారు. సుదీర్ఘ విరామం అనంతరం విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన ఈ ఇద్దరూ... అది్వతీయ ఫామ్ కొనసాగిస్తూ తమ జట్లను గెలిపించారు. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ జట్టు 4 వికెట్ల తేడాతో ఆంధ్ర జట్టుపై గెలిచింది. మొదట ఆంధ్ర 50 ఓవర్లలో 8 వికెట్లకు 298 పరుగులు చేసింది.
రికీ భుయ్ (122; 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. అనంతరం ఢిల్లీ 37.4 ఓవర్లలో 6 వికెట్లకు 300 పరుగులు చేసి నెగ్గింది. కోహ్లి (101 బంతుల్లో 131; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో కోహ్లికిది 58వ శతకం. ఈ క్రమంలో విరాట్ లిస్ట్ ‘ఎ’ క్రికెట్‌లో వేగంగా 16,000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 391 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్ అందుకోగా... కోహ్లి 330 ఇన్నింగ్స్‌లో 16 వేల పరుగుల మైలురాయి దాటాడు.
రోహిత్ తగ్గేదేలే!
ఎలైట్ గ్రూప్ ‘సి’లో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 8 వికెట్ల తేడాతో సిక్కింపై నెగ్గింది. మొదట సిక్కిం 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం ముంబై 30.3 ఓవర్లలో 2 వికెటకు 237 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (94 బంతుల్లో 155; 18 ఫోర్లు, 9 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు. జాతీయ జట్టుకు ఆడాలంటే దేశవాళీల్లోనూ ఆడాలని బీసీసీఐ స్పష్టం చేయడంతో చాన్నాళ్ల తర్వాత కోహ్లి, రోహిత్ విజయ్ హజారే టోర్నీలో బరిలోకి దిగారు.


