
టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా టీ20 కప్- 2025 టోర్నమెంట్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 208కి పైగా స్ట్రైక్‌రేటుతో అభిషేక్ శర్మ 173 పరుగులు సాధించాడు.
తీవ్రమైన ఒత్తిడిలోనూ
తద్వారా ఇప్పటికి టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌పై రెండుసార్లు అభిషేక్ శర్మ చితక్కొట్టిన తీరు టీమిండియా విజయాల్లో హైలైట్‌గా నిలిచింది. లీగ్ దశలో పాక్‌పై 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. సూపర్-4లో 39 బంతుల్లోనే 74 పరుగులతో చెలరేగాడు.
బంపరాఫర్
దాయాదితో సూపర్-4 మ్యాచ్‌లో తీవ్రమైన ఒత్తిడిలోనూ అభిషేక్ శర్మ.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (47)తో కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించి సత్తా చాటాడు. ఈ ప్రదర్శనల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ పంజాబీ బ్యాటర్‌కు బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆసియా కప్-2025 టోర్నీ ముగిసిన తర్వాత.. టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మను ఆసీస్‌తో టీ20లతో పాటు వన్డేల్లోనూ ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
గిల్‌కు విశ్రాంతి?
కాగా శుబ్‌మన్ గిల్ ఇటీవలే టెస్టు జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ గడ్డపై ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ను కెప్టెన్‌గా 2-2తో సమం చేశాడు. అనంతరం.. నెలరోజుల విరామం తర్వాత ఆసియా కప్ బరిలో దిగాడు. అయితే, ఆసియా కప్ ముగిసిన వెంటనే విండీస్‌తో సిరీస్ ఆడనున్నాడు.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా గిల్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టీ20లలో ఇప్పటికే ఓపెనర్‌గా పాతుకుపోయిన అభిషేక్ శర్మ ఇంతవరకు వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి గిల్ వన్డేల్లో ఓపెనింగ్ చేస్తున్నాడు.
జైస్వాల్‌కు అన్యాయం
అయితే, ఆసీస్‌తో సిరీస్‌లలో గిల్ రెస్ట్ తీసుకుంటే అభిషేక్ శర్మను ఓపెనర్‌గా ఎంపిక చేస్తారనే వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అభిషేక్ శర్మ ఆసీస్ గడ్డపై వన్డేల్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా దేశీ యాభై ఓవర్ల ఫార్మాట్లో అతడికి మెరుగైన రికార్డు ఉంది.
లిస్ట్-ఎ క్రికెట్‌లో 61 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ 2014 పరుగులు చేశాడు. ఒకవేళ అభిని ఆసీస్‌తో వన్డేలకు ఎంపిక చేస్తే.. మరో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అన్యాయం చేసినట్లే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటికే టీమిండియా టెస్టు ఓపెనర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్న యశస్వి జైస్వాల్.. టీ20లలో తన మార్కు చూపించాడు. అయితే, వన్డేల్లో మాత్రం ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాడు. స్వదేశంలో ఈ ఏడాది ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా జైసూ ఒకే ఒక్క వన్డే ఆడి.. 15 పరుగులు చేశాడు. ఇంత వరకు అతడికి వన్డేల్లో నిరూపించుకునే అవకాశమే రాలేదు.
వన్డే టాపార్డర్‌లో
ఇలాంటి సమయంలో అభిషేక్ శర్మ జట్టులోకి వచ్చాడంటే.. జైసూకు అవకాశాలు సన్నగిల్లవచ్చు. అయితే, ఇప్పటికే టీ20, టెస్టుల నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం వన్డే టాపార్డర్‌లో జైసూ, అభి, గిల్‌లను చూసే అవకాశాలను కొట్టిపారేయలేము. కాగా టీమిండియా తరఫున టీ20లలో అభిషేక్ శర్మ 21 టీ20లలో 708 పరుగులు సాధించాడు. మరోవైపు.. జైస్వాల్ 23 టీ20లలో 723, 24 టెస్టుల్లో 2209 రన్స్ రాబట్టాడు.
చదవండి: IND vs AUS: మరోసారి దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ.. భారత్ భారీ స్కోరు