పాకిస్తాన్‌ ఓవరాక్షన్‌!.. దీనికే ఇంత చేశారంటే.. | Pakistan U-19 Asia Cup Victory Celebrated With Grand Welcome, Know Reason Behind Online Criticism | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ ఓవరాక్షన్‌!.. అసలు ‘కప్పు’ గెలిస్తే ఇంకేమైనా ఉందా?

Dec 22 2025 1:47 PM | Updated on Dec 22 2025 3:24 PM

Netizens Reacts To Pakistan Extravagant Celebrations U19 Asia Cup Win

నెటిజన్ల సెటైర్లు

మొట్టమొదటిసారిగా 2012లో అండర్‌-19 ఆసియాకప్‌ టైటిల్‌ గెలిచింది పాకిస్తాన్‌. దాదాపు పదమూడేళ్ల తర్వాత మరోసారి తాజాగా ట్రోఫీని ముద్దాడింది. కాగా ఆసియా కప్‌-2025లో గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, యూఏఈ, మలేషియా జట్లతో తలపడ్డ పాక్‌.. భారత్‌ మినహా మిగతా రెండు జట్లపై గెలిచింది. తద్వారా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఈ క్రమంలో సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఫైనల్‌ చేరిన పాకిస్తాన్‌.. టైటిల్‌ పోరులో దాయాది భారత్‌ (IND vs PAK)ను ఢీకొట్టింది. దుబాయ్‌ వేదికగా ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 347 పరుగులు చేసింది.

ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌ భారీ శతకం (113 బంతుల్లో 172)తో చెలరేగగా.. అహ్మద్‌ హుసేన్‌ హాఫ్‌ సెంచరీ (56)తో రాణించాడు. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌ 3 వికెట్లు పడగొట్టగా... హెనిల్‌ పటేల్, ఖిలాన్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. 

కీలక మ్యాచ్‌లో దారుణ వైఫల్యం
అయితే, ఈ టోర్నీ ఆసాంతం దంచికొట్టిన భారత యువ తారలు... కీలక మ్యాచ్‌లో మాత్రం విఫలమయ్యారు. ఫలితంగా భారీ లక్ష్యఛేదనలో భారత జట్టు 26.2 ఓవర్లలో కేవలం 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. దీంతో 191 పరుగుల తేడాతో గెలిచిన పాక్‌ చాంపియన్‌గా నిలిచింది.

భారత ఓపెనర్లలో వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 10 బంతుల్లో 26) వేగంగా ఆడే ప్రయత్నం చేయగా.. కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (Ayush Mhatre- 2) దారుణంగా విఫలమయ్యాడు. ఆరోన్‌ జార్జ్‌ (16), విహాన్‌ మల్హోత్రా (7), వేదాంత్‌ త్రివేది (9), అభిజ్ఞాన్‌ కుందు (13) తేలిపోయారు. పదోస్థానంలో వచ్చిన దీపేశ్‌ 16 బంతుల్లో 36 పరుగులతో కాసేపు పోరాడాడు. అయితే, అప్పటికి పరిస్థితి చేజారి ఓటమి ఖరారైంది.

పాక్‌ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు తీయగా... మొహమ్మద్‌ సయ్యమ్, అబ్దుల్‌ సుభాన్, హుజైఫా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఓపెనింగ్‌ బ్యాటర్‌ సమీర్‌ మన్హాస్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి.  

ఘన స్వాగతం
ఇదిలా ఉంటే.. అండర​-19 ఆసియా కప్‌ గెలిచిన పాక్‌ యువ జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఇస్లామాబాద్‌ విమానాశ్రయంలో దిగగానే జట్టును అభిమానులు చుట్టుముట్టారు. అనంతరం ఇస్లామాబాద్‌లో విక్టరీ పరేడ్‌ నిర్వహించారు. ప్రపంచకప్‌ గెలిచినంతగా సంబరాలు చేసుకున్నారు.

దీనికే ఇంత చేశారంటే..
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘మీ ఓవరాక్షన్‌ ఆపండి.. అండర్‌-19 స్థాయిలో ఆసియా కప్‌ గెలిస్తేనే ఈ స్థాయిలో సెలబ్రేషన్స్‌ చేసుకుంటారా?.. 

ఒకవేళ మీ ప్రధాన జట్టు ప్రపంచకప్‌ గెలిస్తే అసలు తట్టుకుంటారా?.. దేశ ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న పేదరికం.. ఇలాంటి వాటిపై కాస్త దృష్టి పెట్టండి.. ఇలాంటి అతి ఎప్పుడూ పనికిరాదు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

చదవండి: అద్భుతమైన ఆటగాడు.. అయినా ఎందుకు వేటు?.. ఇదే సరైన నిర్ణయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement