ఎన్నాళ్లకెన్నాళ్లకు! | Vijay Hazare ODI tournament starts from today | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకెన్నాళ్లకు!

Dec 24 2025 4:18 AM | Updated on Dec 24 2025 4:18 AM

Vijay Hazare ODI tournament starts from today

దేశవాళీల్లో సూపర్‌ స్టార్‌లు

బరిలోకి దిగనున్న కోహ్లి, రోహిత్‌

నేటి నుంచి విజయ్‌ హజారే వన్డే టోర్నీ

నాలుగు నగరాల్లో మ్యాచ్‌లు

ఢిల్లీతో ఆంధ్ర తొలి పోరు

ఉత్తరప్రదేశ్‌తో హైదరాబాద్‌ ‘ఢీ’

బెంగళూరు: ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీకి రంగం సిద్ధమైంది. జాతీయ జట్టులో ఎంపికకు పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీ టోర్నీల్లో తప్పక ఆడాల్సిందే అనే నిబంధనల నేపథ్యంలో... స్టార్‌ ఆటగాళ్లు సైతం ఈ టోర్నీ బరిలోకి దిగనున్నారు. టి20, టెస్టు ఫార్మాట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత స్టార్‌ ప్లేయర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మతో పాటు శుబ్‌మన్‌ గిల్, సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్‌ పంత్, ఇషాన్‌ కిషన్, అభిషేక్‌ శర్మ వంటి పలువురు టీమిండియా ప్లేయర్లు తమ రాష్ట్రాల జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. 

‘కింగ్‌’ కోహ్లి విజయ్‌ హజారే టోర్నీలో ఆడి దాదాపు 16 సంవత్సరాలు అవుతోంది. కోహ్లి చివరగా ఈ టోర్నీ బరిలోకి దిగిన సమయంలో టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ గెలవలేదు... క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ టీమిండియా ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు... మహేంద్ర సింగ్‌ ధోనీ భారత టెస్టు జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు... రాహుల్‌ ద్రవిడ్, వీవీఎస్‌ లక్ష్మణ్‌ భారత మిడిలార్డర్‌లో పరుగుల వరద పారిస్తున్నారు! 

తొలిసారి ఈ టోర్నీ ఆడే సమయానికి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోని కోహ్లి... ఆ తర్వాత ఇన్నేళ్లలో ఎప్పుడూ తిరిగి విజయ్‌ హజారే టోర్నీలో ఆడలేదు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి... 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు కొనసాగాలనుకుంటున్న నేపథ్యంలో... ఫామ్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకునేందుకు ఈ టోర్నీ తొలి దశ మ్యాచ్‌లు ఆడనున్నట్లు వెల్లడించాడు. 

ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు ఒక హాఫ్‌సెంచరీతో మూడొందలకు పైగా పరుగులు చేసిన విరాట్‌... అదే జోరు దేశవాళీల్లోనూ కొనసాగిస్తాడా చూడాలి. ఇక ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ 2017–18లో చివరగా విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడాడు. 

» మొత్తం 32 ఎలైట్‌ జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో ఎనిమిదేసి జట్లు ఉన్నాయి. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో... ఒక్కో జట్టు మిగిలిన ఏడు జట్లతో తలపడుతుంది. గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.  

»   బెంగళూరు, జైపూర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్‌... ఈ నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నా... ఈ ఏడాది ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన సందర్భంగా జరిగిన విజయోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన తొక్కిసలాటలో 10 మందికి పైగా అభిమానులు మృతిచెందడంతో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి లభించలేదు.  

»  ఈ టోర్నీలో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా... గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లు బెంగళూరులో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎగబడే అవకాశం ఉండటంతో పోలీసులు మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. దీంతో బుధవారం ఢిల్లీ, ఆంధ్ర మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ మైదానానికి తరలించారు.  

»  గతంలో విరాట్‌ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగినప్పుడు ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానం అభిమానులతో నిండిపోయింది. అందుకే ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు.  

»  ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొట్టిన రోహిత్‌ శర్మ... దక్షిణాఫ్రికాపై సైతం మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. కెరీర్‌ను పొడిగించుకోవాలనే లక్ష్యంతోనే భారీగా బరువు తగ్గిన ‘హిట్‌మ్యాన్‌’ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా సిక్కిం, గోవాతో ముంబై తలపడనుంది. 

» టీమిండియా టి20 కెపె్టన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై కూడా అందరి దృష్టి నిలవనుంది. ఏడాది కాలంగా విఫలమవుతున్న సూర్యకుమార్‌... వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ వరకు లయ అందుకునేందుకు ఈ టోర్నమెంట్‌ ఉపయోగపడనుంది.  

»  ఈ ఏడాది టి20ల్లో సూర్యకుమార్‌ సగటు 12.84 కాగా... స్ట్రయిక్‌ రేట్‌ 117.87. ఇది అతడి స్థాయికి ఏమాత్రం తగినది కాదు. గత 22 ఇన్నింగ్స్‌ల్లో అతడు ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేసుకోలేదు. అయితే వచ్చే ఏడాది టి20 వరల్డ్‌కప్‌ జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కించుకున్న సూర్య... మెగా టోర్నీకి ముందు విజయ్‌ హజారే టోర్నీ ద్వారా ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నాడు.  

» కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ జట్టుకు రిషభ్‌ పంత్‌ సారథ్యం వహించనున్నాడు. విరాట్‌ ఆరంభ మ్యాచ్‌లు మాత్రమే ఆడనుండగా... రిషభ్‌ టోర్నీ మొత్తం అందుబాటులో ఉండనున్నాడు. ప్రస్తుతం కేవలం భారత టెస్టు జట్టులోనే కొనసాగుతున్న పంత్‌... పరిమిత ఓవర్లలో పునరాగమనం చేసేందుకు ఈ టోర్నమెంట్‌ ఎంతగానో ఉపయోగపడనుంది.  

» ఇటీవల జరిగిన దేశవాళీ టి20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అది్వతీయ ప్రదర్శనతో జార్ఖండ్‌ జట్టుకు టైటిల్‌ అందించిన యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌... ఈ ఆటతీరులో వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడతడు... విజయ్‌ హజారేలో సైతం అదే దూకుడు కొనసాగించాలని భావిస్తున్నాడు.  

» గతేడాది ఈ టోర్నీలో పరుగుల వరద పారించిన కరుణ్‌ నాయర్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ కర్ణాటక జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. 2024–25 సీజన్‌లో అతడు 8 ఇన్నింగ్స్‌ల్లో 389.5 సగటుతో 779 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు సైతం ఉన్నాయి. దీంతో పాటు రంజీల్లోనూ రాణించిన అతడికి ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.   

»   ఐపీఎల్‌ మినీ వేలం ముగిసినప్పటికీ... ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసిన ప్లేయర్లపై ఫ్రాంచైజీలు దృష్టి సారించడం ఖాయం. గతంలో ఈ టోర్నీ ఆటతీరు ఆధారంగా... స్మరణ్, మయాంక్‌ ఐపీఎల్‌ అవకాశాలు దక్కించుకున్నారు.  

» ఫలితాలపై వాతావరణం ప్రభావం ఉండకూదనే ఉద్దేశంతో మ్యాచ్‌లన్నీ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేలా షెడ్యూల్‌ రూపొందించారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేసే జట్టుపై ఎలాంటి మంచు ప్రభావం పడే అవకాశం లేదు. 

»  ఇక టి20 వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన భారత టెస్టు, వన్డే కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌పై కూడా అందరి దృష్టి నిలవనుంది. అభిషేక్‌ శర్మ సారథ్యంలో పంజాబ్‌ జట్టు తరఫున గిల్‌ బరిలోకి దిగనున్నాడు. 

» ప్రస్తుతం భారత జట్టులో పేస్‌ బౌలర్ల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై పని భారం ఎక్కువవుతుండగా... ఇతర పేసర్లు నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్‌ స్పీడ్‌ స్టార్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ను సెలెక్టర్లు కేవలం టెస్టు ఫార్మాట్‌కే పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. 

మరి ఈ నేపథ్యంలో తదుపరి తరం పేసర్లు ఎవరనేదానికి ఈ టోర్నీ ద్వారా సమాధానం లభిస్తుందా చూడాలి. గుర్‌జపనీత్‌ సింగ్‌ (తమిళనాడు), గుర్‌నూర్‌ బ్రార్‌ (పంజాబ్‌), యు«ద్‌వీర్‌ సింగ్‌ (జమ్మూ కశ్మీర్‌), అనూజ్‌ (హరియాణా), షకీబ్‌ హుసేన్‌ (బిహార్‌) రూపంలో పలువురు యువ పేసర్లు ఈ టోర్నీలో ఆడనున్నారు.

హైదరాబాద్‌ X ఉత్తర ప్రదేశ్‌
ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా రాజ్‌కోట్‌లో జరగనున్న మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌తో హైదరాబాద్‌ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో హైదరాబాద్‌ జట్టుకు రాహుల్‌ సింగ్‌ సారథ్యం వహిస్తుండగా... రాహుల్‌ బుద్ధి వైస్‌ కెపె్టన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల ముస్తాక్‌ అలీ ట్రోఫీ గ్రూప్‌ దశలో మెరుగైన ప్రదర్శన చేసి... సునాయాసంగా ‘సూపర్‌ లీగ్‌’కు చేరిన హైదరాబాద్‌... చివరి మ్యాచ్‌లో పరాజయంతో ఫైనల్‌ ఆడే అవకాశం కోల్పోయింది. 

ఈ నేపథ్యంలో ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని హైదరాబాద్‌ భావిస్తోంది. కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌తో పాటు తన్మయ్‌ అగర్వాల్, తనయ్‌ త్యాగరాజన్, అమన్‌ రావు, అభిరథ్‌ రెడ్డి, కార్తికేయ, రక్షణ్‌ సమష్టిగా సత్తా చాటాల్సిన అవసరముంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో జట్టులో ప్రియం గార్గ్, ధ్రువ్‌ జురెల్, కార్తీక్‌ త్యాగి, సమీర్‌ రిజ్వీ, రింకూ సింగ్‌ కీలకం కానున్నారు.

ఆంధ్ర జట్టుకు లక్కీ చాన్స్‌
ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా బుధవారం జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు... స్టార్‌లతో నిండి ఉన్న ఢిల్లీ టీమ్‌తో తలపడనుంది. బెంగళూరు వేదికగా జరగనున్న మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌తో కూడిన ఢిల్లీ జట్టుపై మెరుగైన ప్రదర్శన చేయాలని ఆంధ్ర జట్టు భావిస్తోంది. 

ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి నిలవనున్న నేపథ్యంలో... మనవాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం. టీమిండియా పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆంధ్ర జట్టుకు సారథ్యం వహిస్తుండగా... శ్రీకర్‌ భరత్, రికీ భుయ్, అశ్విన్‌ హెబ్బర్, షేక్‌ రషీద్‌ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. సత్యనారాయణ రాజు, వినయ్, స్టీఫెన్‌ బౌలింగ్‌ భారం మోయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement