టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు టీ20 వరల్డ్‌కప్-2026 జట్టులో చోటు దక్కలేదు. మొన్నటివరకు వైస్ కెప్టెన్‌గా గిల్‌ను ఇప్పుడు ఏకంగా జట్టు నుంచే తప్పించారు. పేలవ ఫామ్ కారణంగా అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. ఈ ఏడాది ఆసియాకప్‌తో తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన గిల్ తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు.
అతడి కోసం ఇన్ ఫామ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను టీమ్ మెనెజ్‌మెంట్ పక్కన పెట్టింది. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికి గిల్‌పై మెనెజ్‌మెంట్ నమ్మకం ఉంచింది. కానీ ఆ నమ్మకాన్ని శుభ్‌మన్ నిలబెట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి తప్పించారు.
అయితే సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గిల్ ప్రస్తుత ఫామ్ ఆందోళనకరంగా ఉన్నప్పటికి.. అతడిలోని టాలెంట్ ఎప్పటికి పోదు అని గవాస్కర్ అన్నారు.
"నిజంగా ఇది సర్‌ప్రైజ్. గిల్ ఒక క్వాలిటీ బ్యాటర్. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్‌లో కూడా పరుగులు సాధించాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అతడు విఫలమయ్యాడు. అందుకు నేను అంగీకరిస్తా.
కానీ ఫామ్ అనేది తాత్కాలికం, క్లాస్ అనేది శాశ్వతం. టీ20 ఫార్మాట్‌కు చాలా కాలం దూరంగా ఉండటం వల్లే గిల్ తన రిథమ్‌ను కోల్పోయాడు. టెస్టు క్రికెట్‌లో దుమ్ములేపుతున్న గిల్‌కు టీ20 శైలి అలవడటానికి కొంత సమయం పడుతుందని" స్టార్ స్పోర్ట్స్ షోలో గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా శుభ్‌మన్ గిల్ స్ధానంలో జట్టులోకి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వచ్చాడు. రెండేళ్ల తర్వాత అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.
చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్‌కు ఊహించని షాక్?


