BCCI: వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. గిల్‌ అవుట్‌ | T20 World Cup 2026: BCCI Announced Squad No Place For Gill | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌ 2026: జట్టును ప్రకటించిన బీసీసీఐ.. గిల్‌ అవుట్‌

Dec 20 2025 2:11 PM | Updated on Dec 20 2025 2:43 PM

T20 World Cup 2026: BCCI Announced Squad No Place For Gill

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై జరిగే ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను శనివారం వెల్లడించింది.  స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ ఇదే జట్టు ఆడుతుందని బోర్డు స్పష్టం చేసింది. 

ఇక అనూహ్య రీతిలో.. వైస్‌ కెప్టెన్‌గా ఉన్న గిల్‌ (Shubman Gill)కు ప్రపంచకప్‌ జట్టులో స్థానం దక్కలేదు. అతడి స్థానంలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (Axar Patel) సూర్య డిప్యూటీగా నియమితుడయ్యాడు. మరోవైపు.. జితేశ్‌ శర్మ విషయంలోనూ యాజమాన్యం ఊహించని నిర్ణయం తీసుకుంది.

జితేశ్‌కూ దక్కని చోటు.. దూసుకు వచ్చిన ఇషాన్‌
తుదిజట్టులో గిల్‌ ఉండేలా.. సంజూ ఓపెనింగ్‌ స్థానం త్యాగం చేయించిన మేనేజ్‌మెంట్‌.. వికెట్‌ కీపర్‌గా జితేశ్‌కు పెద్ద పీట వేసి లోయర్‌ ఆర్డర్లో ఆడించింది. అయితే, ప్రపంచకప్‌ జట్టు నుంచి జితేశ్‌ను తప్పించి.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దుమ్ములేపిన ఇషాన్‌ కిషన్‌ను తీసుకువచ్చింది. అతడిని బ్యాకప్‌ ఓపెనర్‌గా ఉపయోగించుకుంటామని తెలిపింది.

అదే విధంగా.. నయా ఫినిషర్‌గా పేరొందిన రింకూ సింగ్‌ను మేనేజ్‌మెంట్‌ కనికరించింది. మరోసారి వరల్డ్‌కప్‌ జట్టులో భాగమయ్యే అవకాశం ఇచ్చింది. ఇక వరుస వైఫల్యాల నేపథ్యంలోనే గిల్‌ను జట్టు నుంచి తప్పించినట్లు స్పష్టమవుతోంది. కాగా భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్‌కప్‌ టోర్నీకి ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య షెడ్యూల్‌ ఖరారైంది. 

కొత్తగా బీసీసీఐ కార్యదర్శి
ఈసారి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా.. టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్‌ యాదవ్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయనే జట్టును కూడా ప్రకటించడం విశేషం.

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత జట్టు 
సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, అక్షర్‌ పటేల్‌ (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా,  ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రింకూ సింగ్‌.

చదవండి: WC 2026: ఒకప్పుడు విలన్‌.. ఈసారి హీరో అవుతాడా?.. ‘ఎక్స్‌ ఫ్యాక్టర్‌’ ఎవరంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement