రబాట్ (మొరాకో): ఆఫ్రికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఐవరీకోస్ట్ జట్టు శుభారంభం చేసింది. మొజాంబిక్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ తొలి లీగ్ మ్యాచ్‌లో ఐవరీకోస్ట్ 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 49వ నిమిషంలో ఎమాద్ చేసిన గోల్‌తో ఐవరీకోస్ట్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని ఐవరీకోస్ట్ తమ ఖాతాలో మూడు పాయింట్లను వేసుకుంది.
ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో కామెరూన్ 1–0 గోల్ తేడాతో గాబోన్ జట్టును ఓడించింది. ఆట ఆరో నిమిషంలో ఇట్టా ఇయోంగ్ గోల్ చేసి కామెరూన్ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత గాబోన్ జట్టు స్కోరును సమం చేసేందుకు యత్నించి విఫలమైంది. కామెరూన్–గాబోన్ మ్యాచ్‌తో ఆరు గ్రూప్‌ల తొలి రౌండ్ మ్యాచ్‌లు ముగిశాయి.
గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య మొరాకో జట్టు... గ్రూప్ ‘బి’లో ఈజిప్‌్ట, దక్షిణాఫ్రికా జట్లు... గ్రూప్ ‘సి’లో ట్యునిషియా, నైజీరియా జట్లు... గ్రూప్ ‘డి’లో సెనెగల్, డీఆర్ కాంగో జట్లు... గ్రూప్ ‘ఇ’లో అల్జీరియా, బుర్కినఫాసో జట్లు... గ్రూప్ ‘ఎఫ్’లో ఐవరీకోస్ట్, కామెరూన్ జట్లు తమ ప్రత్యర్థి జట్లపై గెలుపొందాయి. నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ రెండో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో జాంబియాతో కొమోరోస్; మొరాకోతో మాలి... గ్రూప్ ‘బి’ రెండో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో అంగోలాతో జింబాబ్వే; ఈజిప్ట్‌తో దక్షిణాఫ్రికా తలపడతాయి.


