రెండోసారి ఆఫ్రికా కప్ ఫుట్‌బాల్ టైటిల్ సొంతం
ఫైనల్లో మొరాకోపై 1–0తో విజయం
మొరాకో జట్టుకు ‘పెనాల్టీ’ ఇవ్వడంపై అభిమానుల గొడవ
14 నిమిషాలు నిలిచిపోయిన ఆట
పెనాల్టీని వృథా చేసిన మొరాకో స్టార్ డియాజ్
సెనెగల్‌ను గెలిపించిన పాపె గుయె గోల్
రబాట్ (మొరాకో): నాటకీయ పరిణామాల మధ్య ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సెనెగల్ జట్టు పైచేయి సాధించింది. రెండోసారి ఆఫ్రికా కప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో సెనెగల్ 1–0 గోల్ తేడాతో ఆతిథ్య మొరాకో జట్టును ఓడించింది. 2021లో తొలిసారి సెనెగల్ ఆఫ్రికా కప్ టైటిల్‌ను సాధించింది. ఈ ఓటమితో 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఆఫ్రికా చాంపియన్‌గా నిలవాలని ఆశించిన మొరాకో జట్టుకు నిరాశే ఎదురైంది.
డియాజ్‌ను తోసేసిన డియాఫ్
మ్యాచ్ రెండో అర్ధభాగం స్టాపేజ్ సమయంలో మొరాకో జట్టుకు రిఫరీ పెనాల్టీ ఇవ్వడంపై దుమారం చెలరేగింది. ‘డి’ ఏరియా లోపల మొరాకో ప్లేయర్ బ్రహిమ్ డియాజ్‌ను సెనెగల్ ప్లేయర్ ఎల్ హాద్జి మలిక్ డియాఫ్ తోసేశాడు. దాంతో రిఫరీ జీన్ జాక్వెస్ మొరాకో జట్టుకు పెనాల్టీ కిక్‌ను ప్రదానం చేశాడు.
నిరసన
ఈ నిర్ణయంతో సెనెగల్ ఆటగాళ్లతోపాటు మైదానంలోని ఆ జట్టు అభిమానులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య కొంచెంసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. రిఫరీ నిర్ణయాన్ని నిరసిస్తూ సెనెగల్ ఆటగాళ్లు మైదానాన్ని కూడా వీడారు.
టీవీ రిప్లేలు చూశాక మొరాకో జట్టుకు రిఫరీ పెనాల్టీ ఇవ్వడం సరైనదేనని తేలింది. దాంతో 14 నిమిషాల తర్వాత మళ్లీ సెనెగల్ ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. పెనాల్టిని గోల్‌గా మలిచి, కొన్ని నిమిషాలు సెనెగల్‌ను నిలువరిస్తే మొరాకో ఖాతాలో 50 ఏళ్ల తర్వాత ఆఫ్రికా కప్ చేరేది. కానీ అలా జరగలేదు.
సువర్ణావకాశం చేజారింది
ఈ టోర్నీలో 5 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచిన మొరాకో స్టార్ బ్రహిమ్ డియాజ్ పెనాల్టిని తీసుకోవడానికి వచ్చాడు. తీవ్రమైన ఒత్తిడిలో డియాజ్ బంతిని నేరుగా కొట్టడం... సెనెగల్ గోల్‌కీపర్ ఎడువార్డో మెండీ దానిని నిలువరించడం జరిగిపోయింది. దాంతో మొరాకో సువర్ణావకాశం చేజారింది.
స్టాపేజ్ సమయం ముగియడంతో మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. అదనపు సమయంలోని నాలుగో నిమిషంలో కెపె్టన్ ఇద్రిసా గుయె అందించిన పాస్‌ను ‘డి’ ఏరియా లోపల అందుకున్న పాపె గుయె లక్ష్యానికి చేర్చడంతో సెనెగల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు మొరాకో ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలను సెనెగల్ సమర్థంగా అడ్డుకొని టైటిల్‌ను ఖాయం చేసుకుంది.

రూ. 90 కోట్ల 86 లక్షలు
ఆఫ్రికా కప్ టైటిల్ సాధించిన సెనెగల్ జట్టుకు 1 కోటి డాలర్ల (రూ. 90 కోట్ల 86 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్‌గా నిలిచిన మొరాకో జట్టు ఖాతాలో 40 లక్షల డాలర్లు (రూ. 36 కోట్ల 34 లక్షలు) చేరాయి.
మూడో స్థానం పొందిన నైజీరియా జట్టుకు 25 లక్షల డాలర్లు (రూ. 22 కోట్ల 71 లక్షలు), నాలుగో స్థానంలో నిలిచిన ఈజిప్ట్ జట్టుకు 13 లక్షల డాలర్లు (రూ. 11 కోట్ల 81 లక్షలు) లభించాయి. క్వార్టర్ ఫైనల్లో ఓడిన మాలి, ఐవరీకోస్ట్, అల్జీరియా, కామెరూన్ జట్లకు 8 లక్షల డాలర్ల (రూ. 7 కోట్ల 26 లక్షలు) చొప్పున అందజేశారు.
121
మొత్తం 24 జట్ల మధ్య గత డిసెంబర్ 21 నుంచి జనవరి 18 వరకు జరిగిన ఆఫ్రికా కప్ టోర్నీలో మొత్తం 52 మ్యాచ్‌లు జరిగాయి. 121 గోల్స్ నమోదయ్యాయి. మొరాకో ప్లేయర్ బ్రహిమ్ డియాజ్ 5 గోల్స్‌తో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టోర్నీ ‘ఉత్తమ ప్లేయర్’ అవార్డును సెనెగల్‌కు చెందిన సాదియోమానె గెల్చుకోగా... ‘ఉత్తమ గోల్‌కీపర్’గా మొరాకోకు చెందిన యాసిన్ బునుయ్ నిలిచాడు.
2027లో ఎక్కడంటే....
తదుపరి ఆఫ్రికా కప్ టోర్నీకి తొలిసారి మూడు దేశాలు ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2027లో జరిగే ఈ టోర్నీ కెన్యా, టాంజానియా, ఉగాండా దేశాల్లో జరుగుతుంది. 69 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో రెండుసార్లు మాత్రమే రెండు దేశాలు సంయుక్తంగా (2000లో ఘనా–నైజీరియా; 2012లో ఈక్వెటోరియల్ గినీ–గాబోన్) ఆతిథ్యమిచ్చాయి.
చదవండి: ఆమె మనిషి కాదు!


