మెల్‌బోర్న్: ఈ సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పోటీపడే టెన్నిస్ ప్లేయర్ల ప్రైజ్‌మనీ చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 111.5 మిలియన్ ఆసీస్ డాలర్లు. అంటే మన కరెన్సీలో అక్షరాల రూ. 675 కోట్లు.
గత ఏడాది ప్రైజ్‌మనీ 96.5 మిలియన్ ఆసీస్ డాలర్ల (రూ.584 కోట్లు)తో పోల్చితే 16 శాతం పెరిగిందని టెన్నిస్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ క్రెయిగ్ టిలే వెల్లడించారు. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 4.15 మిలియన్ ఆసీస్ డాలర్లు (రూ.25.15 కోట్లు) చొప్పున అందజేస్తారు.
సింగిల్స్ విజేతల ప్రైజ్‌మనీ ఏకంగా 19 శాతం పెంచారు. అలాగే మెయిన్ డ్రా ఆడే సింగిల్స్, డబుల్స్ ఆటగాళ్ల ప్రైజ్‌మనీ కూడా 10 శాతం మేర పెంచినట్లు నిర్వాహకులు ఆయన తెలిపారు. 2023 నుంచి టెన్నిస్ ప్లేయర్లకు ప్రోత్సాహకాలను భారీ పెంచుతున్నామని ఆయన చెప్పారు. ఈ నెల 18 నుంచి మెల్‌బోర్న్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ జరుగుతుంది.
క్వార్టర్స్‌లో సాకేత్ జోడీ
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకెత్ మైనేని బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో మంగళవారం సాకేత్ మైనేని–ఆదిల్ కల్యాణ్‌పూర్ జోడీ 7–6 (7/3), 4–6, 13–11తో సుమిత్ నగాల్ (భారత్)–లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా) ద్వయంపై పోరాడి గెలిచింది.
ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట 3 ఏస్‌లు బాదగా... సుమిత్ నగాల్ ద్వయం 8 ఏస్‌లు సంధించింది. 3 డబుల్ ఫాల్ట్‌లు చేసిన సాకేత్–ఆదిల్ జోడీ... ఒక బ్రేక్ పాయింట్ సాధించింది. సాకేత్ జంట మొత్తం 78 పాయింట్లు గెలుచుకోగా... నగాల్ ద్వయం 69 పాయింట్లకు పరిమితమైంది. గురువారం జరగనున్న క్వార్టర్ ఫైనల్లో ఆర్థర్ రేమాండ్–లుకా సాంచెజ్ (ఫ్రాన్స్) ద్వయంతో... సాకేత్–ఆదిల్ జంట అమీతుమీ తేల్చుకోనుంది.


