breaking news
Africa Cup Of Nations
-
‘ఆఫ్రికా కప్’ కోసం సెనెగల్ అప్పీల్
జెనివా: ఆఫ్రికా కప్ గెలిచిన మమ్మల్నే తిరిగి విజేతగా ప్రకటించాలని సెనెగల్ ఫుట్‌బాల్ జట్టు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీలు చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్‌బాల్ (సీఏఎఫ్) తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై సెనెగల్ సీఏఎస్‌లో సవాల్ చేసింది. ఈ అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన సీఏఎస్ విచారణ, తుది తీర్పు వెలువరించేందుకు కాలపరిమితి లేదని సెనెగల్‌కు తేల్చిచెప్పింది. దీంతో సెనెగల్ కోరుతున్న న్యాయం ఎప్పుడు దక్కుతుందో ఎవరికీ తెలియదన్న మాట! ఏం జరిగిందంటే? మొరాకో వేదికగా జనవరిలో ఆతిథ్య మొరాకో, సెనెగల్ మధ్య ఆఫ్రికా కప్ ఫైనల్స్ మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయం 0–0తో ముగియగా...‘ఎక్స్ట్రా’ టైమ్‌లో మొరాకోకు ఇచ్చిన ‘పెనాల్టీ’ని వ్యతిరేకిస్తూ సెనెగల్ నిష్క్రమించింది. తర్జనభర్జన అనంతరం మైదానంలోకి దిగగా... సెనెగల్ గోల్‌కీపర్ పెనాల్టీని అడ్డుకున్నాడు. తర్వాత సెనెగల్ గోల్ చేసి విజేతగా నిలిచింది. అయితే సెనెగల్ మైదానం నిష్క్రమించడంతోనే ఆడే అర్హతను కోల్పోయిందని కాబట్టి తమనే విజేతగా ప్రకటించాలని మొరాకో సీఏఎఫ్లో కేసు వేయగా... సీఏఎఫ్ మొరాకోకు అనుకూలంగా తీర్పునిచ్చింది. -
ప్రైజ్‌మనీ రూ. 90 కోట్ల 86 లక్షలు
రబాట్ (మొరాకో): నాటకీయ పరిణామాల మధ్య ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సెనెగల్ జట్టు పైచేయి సాధించింది. రెండోసారి ఆఫ్రికా కప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో సెనెగల్ 1–0 గోల్ తేడాతో ఆతిథ్య మొరాకో జట్టును ఓడించింది. 2021లో తొలిసారి సెనెగల్ ఆఫ్రికా కప్ టైటిల్‌ను సాధించింది. ఈ ఓటమితో 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఆఫ్రికా చాంపియన్‌గా నిలవాలని ఆశించిన మొరాకో జట్టుకు నిరాశే ఎదురైంది. డియాజ్‌ను తోసేసిన డియాఫ్మ్యాచ్ రెండో అర్ధభాగం స్టాపేజ్ సమయంలో మొరాకో జట్టుకు రిఫరీ పెనాల్టీ ఇవ్వడంపై దుమారం చెలరేగింది. ‘డి’ ఏరియా లోపల మొరాకో ప్లేయర్ బ్రహిమ్ డియాజ్‌ను సెనెగల్ ప్లేయర్ ఎల్ హాద్జి మలిక్ డియాఫ్ తోసేశాడు. దాంతో రిఫరీ జీన్ జాక్వెస్ మొరాకో జట్టుకు పెనాల్టీ కిక్‌ను ప్రదానం చేశాడు. నిరసనఈ నిర్ణయంతో సెనెగల్ ఆటగాళ్లతోపాటు మైదానంలోని ఆ జట్టు అభిమానులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య కొంచెంసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. రిఫరీ నిర్ణయాన్ని నిరసిస్తూ సెనెగల్ ఆటగాళ్లు మైదానాన్ని కూడా వీడారు. టీవీ రిప్లేలు చూశాక మొరాకో జట్టుకు రిఫరీ పెనాల్టీ ఇవ్వడం సరైనదేనని తేలింది. దాంతో 14 నిమిషాల తర్వాత మళ్లీ సెనెగల్ ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. పెనాల్టిని గోల్‌గా మలిచి, కొన్ని నిమిషాలు సెనెగల్‌ను నిలువరిస్తే మొరాకో ఖాతాలో 50 ఏళ్ల తర్వాత ఆఫ్రికా కప్ చేరేది. కానీ అలా జరగలేదు. సువర్ణావకాశం చేజారిందిఈ టోర్నీలో 5 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచిన మొరాకో స్టార్ బ్రహిమ్ డియాజ్ పెనాల్టిని తీసుకోవడానికి వచ్చాడు. తీవ్రమైన ఒత్తిడిలో డియాజ్ బంతిని నేరుగా కొట్టడం... సెనెగల్ గోల్‌కీపర్ ఎడువార్డో మెండీ దానిని నిలువరించడం జరిగిపోయింది. దాంతో మొరాకో సువర్ణావకాశం చేజారింది. స్టాపేజ్ సమయం ముగియడంతో మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. అదనపు సమయంలోని నాలుగో నిమిషంలో కెపె్టన్ ఇద్రిసా గుయె అందించిన పాస్‌ను ‘డి’ ఏరియా లోపల అందుకున్న పాపె గుయె లక్ష్యానికి చేర్చడంతో సెనెగల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు మొరాకో ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలను సెనెగల్ సమర్థంగా అడ్డుకొని టైటిల్‌ను ఖాయం చేసుకుంది. రూ. 90 కోట్ల 86 లక్షలు ఆఫ్రికా కప్ టైటిల్ సాధించిన సెనెగల్ జట్టుకు 1 కోటి డాలర్ల (రూ. 90 కోట్ల 86 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్‌గా నిలిచిన మొరాకో జట్టు ఖాతాలో 40 లక్షల డాలర్లు (రూ. 36 కోట్ల 34 లక్షలు) చేరాయి. మూడో స్థానం పొందిన నైజీరియా జట్టుకు 25 లక్షల డాలర్లు (రూ. 22 కోట్ల 71 లక్షలు), నాలుగో స్థానంలో నిలిచిన ఈజిప్ట్ జట్టుకు 13 లక్షల డాలర్లు (రూ. 11 కోట్ల 81 లక్షలు) లభించాయి. క్వార్టర్ ఫైనల్లో ఓడిన మాలి, ఐవరీకోస్ట్, అల్జీరియా, కామెరూన్ జట్లకు 8 లక్షల డాలర్ల (రూ. 7 కోట్ల 26 లక్షలు) చొప్పున అందజేశారు. 121 మొత్తం 24 జట్ల మధ్య గత డిసెంబర్ 21 నుంచి జనవరి 18 వరకు జరిగిన ఆఫ్రికా కప్ టోర్నీలో మొత్తం 52 మ్యాచ్‌లు జరిగాయి. 121 గోల్స్ నమోదయ్యాయి. మొరాకో ప్లేయర్ బ్రహిమ్ డియాజ్ 5 గోల్స్‌తో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టోర్నీ ‘ఉత్తమ ప్లేయర్’ అవార్డును సెనెగల్‌కు చెందిన సాదియోమానె గెల్చుకోగా... ‘ఉత్తమ గోల్‌కీపర్’గా మొరాకోకు చెందిన యాసిన్ బునుయ్ నిలిచాడు. 2027లో ఎక్కడంటే.... తదుపరి ఆఫ్రికా కప్ టోర్నీకి తొలిసారి మూడు దేశాలు ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2027లో జరిగే ఈ టోర్నీ కెన్యా, టాంజానియా, ఉగాండా దేశాల్లో జరుగుతుంది. 69 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో రెండుసార్లు మాత్రమే రెండు దేశాలు సంయుక్తంగా (2000లో ఘనా–నైజీరియా; 2012లో ఈక్వెటోరియల్ గినీ–గాబోన్) ఆతిథ్యమిచ్చాయి. చదవండి: ఆమె మనిషి కాదు!


