ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధించిన అతిచిన్న దేశంగా రికార్డు
కింగ్‌స్టన్ (జమైకా): ప్రతికూలతల గురించి పదేపదే ప్రస్తావించకుండా... పక్కా ప్రణాళికతో... సరైన మార్గదర్శకుడి ఆధ్వర్యంలో... పోరాడితే అద్భుతం చేయవచ్చని... కేవలం 1,56,115 మంది జనాభా కలిగిన కురసావ్ దేశం నిరూపించింది. 95 ఏళ్ల చరిత్ర కలిగిన పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన అతిచిన్న దేశంగా కురసావ్ చరిత్ర పుటల్లో చోటు సంపాదించింది.
ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ జోన్ క్వాలిఫయింగ్ టోర్నీలో కురసావ్ గ్రూప్ ‘బి’ విజేతగా నిలిచి తొలిసారి ప్రపంచకప్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. జనాభా పరంగా ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందిన అతిచిన్న దేశంగా ఐస్‌లాండ్ (2018లో 3,50,000 జనాభా) పేరిట ఉన్న రికార్డును కురసావ్ సవరించింది.

కరీబియన్ దీవుల్లో 444 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన ఈ ద్వీపదేశం... జమైకా జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌ను 0–0తో ‘డ్రా’ చేసుకుంది. తద్వారా నాలుగు జట్లున్న గ్రూప్ ‘బి’లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని 12 పాయింట్లతో టాప్‌లో నిలిచింది.
నెదర్లాండ్స్‌కు చెందిన విఖ్యాత కోచ్ డిక్ అడ్వోకాట్ ఆధ్వర్యంలో కురసావ్ ప్రపంచకప్‌లో ఆడాలన్న తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. గతంలో అడ్వోకాట్ 1994 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన నెదర్లాండ్స్ జట్టుకు... 2006 ప్రపంచకప్‌లో దక్షిణ కొరియా జట్టుకు కోచ్‌గా ఉన్నారు. గతంలో నెదర్లాండ్స్ అంటిలీస్‌గా గుర్తింపు పొందిన కురసావ్ 2011లో స్వయం ప్రతిపత్తిని సాధించింది.
బెర్త్ ఎలా దక్కిందంటే...
ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ జోన్‌లో భాగంగా మొత్తం 32 జట్లు బరిలోకి దిగాయి. ఈ 32 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఈ ఆరు గ్రూప్‌లకు సంబధించి అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యాక ఒక్కో గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు (12) మూడో రౌండ్‌కు అర్హత పొందాయి. మూడో రౌండ్‌లో 12 జట్లను మూడు గ్రూప్‌లుగా (ఒక్కో గ్రూప్‌లో 4 జట్లు) విభజించారు.
మూడో రౌండ్ మ్యాచ్‌లు ముగిశాక మూడు గ్రూప్‌లలో విజేతగా నిలిచిన జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిచాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి పనామా... గ్రూప్ ‘సి’ నుంచి హైతీ కూడా ప్రపంచకప్ బెర్త్‌లు సాధించాయి. అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యమిస్తున్న 2026 ప్రపంచకప్‌లో తొలిసారి 48 జట్లు ఆడనున్నాయి. ఇప్పటి వరకు 42 దేశాలు అర్హత సాధించగా ... మరో 6 దేశాలు ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ టోర్నీల ద్వారా అర్హత పొందుతాయి.
ఇప్పటి వరకు అర్హత సాధించిన దేశాలు (42/48)
అమెరికా, కెనడా, మెక్సికో, ఆ్రస్టేలియా, ఇరాన్, జపాన్, జోర్డాన్, దక్షిణ కొరియా, ఖతర్, సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్, అల్జీరియా, కేప్ వెర్డె, ఐవరీకోస్ట్, ఈజిప్‌్ట, ఘనా, మొరాకో, సెనెగల్, దక్షిణాఫ్రికా, ట్యూనిషియా, కురసావ్, హైతీ, పనామా, అర్జెంటీనా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, పరాగ్వే, ఉరుగ్వే, న్యూజిలాండ్, ఆ్రస్టియా, బెల్జియం, క్రొయేషియా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, స్కాట్లాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్.


