భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆదివారం(జనవరి 11) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొదటి వన్డేకు వడోదరలోని బీసీఎ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అయితే ఏడాదిన్నర కిందట స్వదేశంలో భారత్‌ను టెస్టుల్లో వైట్‌వాష్ చేసిన కివీస్.. ఇప్పుడు అదే ఫలితాన్ని వన్డేల్లో కూడా పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది.
ఇదే విషయాన్ని తొలి వన్డేకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ విల్ యంగ్ స్పష్టం చేశాడు. కివీస్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, భారత్‌ను ఓడించగలమని యంగ్ థీమా వ్యక్తం చేశాడు. కాగా 2024 ఆఖరిలో భారత్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ సంచలనం సృష్టించింది.
మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ వైట్ వాష్ చేసింది. బ్లాక్ క్యాప్స్ జట్టు 1955 తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక సిరీస్ విజయంలో యంగ్‌ది కీలక పాత్ర. యంగ్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఇప్పుడు వన్డేల్లో కూడా సత్తాచాటాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు.
"ఈసారి భిన్నమైన ఫార్మాట్‌లో క్రికెట్ ఆడేందుకు భారత్ పర్యటనకు వచ్చాము. మా జట్టు ప్రస్తుతం వన్డేల్లో అద్భుతంగా రాణిస్తోంది. సీనియర్ ప్లేయర్లు దూరంగా ఉన్నప్పటికి మేము మెరుగైన ప్రదర్శన చేస్తామన్న నమ్మకం నాకు ఉంది. ఈ సిరీస్‌కు ముందు మేము స్వదేశంలో ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో వన్డేల్లో విజయం సాధించాము.
గత భారత పర్యటనలో మేము సాధించిన విజయం మాకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది. ఈసారి కూడా గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాము. భారత్‌లో మరొక సిరీస్ గెలవడమే మా లక్ష్యం. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో చివరి మెట్టుపై బోల్తా పడ్డాము. కానీ ఆ ఓటమిని మేము ఎప్పుడో మర్చిపోయాము.
ఇప్పుడు మా దృష్టి కేవలం ఈ ద్వైపాక్షిక సిరీస్ పైనే ఉంది" అని పేర్కొన్నాడు. కాగా గతేడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ చేతిలో కివీస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ భారత పర్యటకు కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్,రచిన్ రవీంద్ర వంటి స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. వన్డే సిరీస్‌కు కివీస్ కెప్టెన్‌గా మైఖల్ బ్రెస్‌వెల్ వ్యవహరించనున్నాడు.
చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో


