జగజ్జేతగా మన మహిళలు
2025లో భారత క్రికెట్ జట్టు ప్రస్థానం
సాక్షి క్రీడా విభాగం : ఇంగ్లండ్‌లో యువ జట్టుతో ఓటమి లేకుండా తిరిగొచ్చామని సంబరం ఒకవైపు, సొంతగడ్డపై పాతికేళ్ల తర్వాత సఫారీలకు సిరీస్ కోల్పోయిన పరాభవం మరోవైపు.... వన్డేల్లో పుష్కర కాలం తర్వాత ఐసీసీ ట్రోఫీ ఆనందాన్ని పంచితే... టి20ల్లో అజేయ ఆటతో ఆసియా కప్ గెలుచుకొని ఈ ఫార్మాట్‌లో మన స్థాయి కనిపించింది.
మొత్తంగా 2025లో భారత క్రికెట్ జట్టు మిశ్రమ ఫలితాలు సాధించింది. టెస్టుల్లో ప్రదర్శన కాస్త అసంతృప్తిని మిగల్చగా... పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వరుస విజయాలతో ప్రత్యర్థులపై పైచేయి చూపించింది. మరోవైపు పురుషులకు ఏమాత్రం తగ్గని రీతిలో భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ టైటిల్ సాధించడం అన్నింటికంటే చిరస్మరణీయ ఘట్టం.
కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ముద్ర...
సిడ్నీలో ఆ్రస్టేలియాతో ఐదో టెస్టుతో ఈ ఏడాది మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఓటమితో సిరీస్ 1–3తో చేజారింది. అయితే 32 వికెట్లతో బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. పేలవ బ్యాటింగ్‌తో జట్టుకు భారం కాలేనంటూ రోహిత్ శర్మ స్వయంగా మ్యాచ్‌కు ముందు తప్పుకోవడం చర్చకు దారి తీసింది. చివరకు ఇదే అతని ఆఖరి టెస్టుగా మారగా, కొన్నాళ్ల తర్వాత సరిగ్గా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు మరో స్టార్ కోహ్లి కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో సీనియర్లు లేకుండా అంచనాలు లేకుండా ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు అద్భుతమే చేసింది. నాలుగు టెస్టుల తర్వాత 1–2తో వెనుకబడి సిరీస్ కోల్పోయే స్థితిలో పడిన జట్టు ఓవల్‌లో జరిగిన ఆఖరి టెస్టులో మొహమ్మద్ సిరాజ్ అసాధారణ బౌలింగ్‌తో అనూహ్యంగా 6 పరుగులతో నెగ్గి సంతృప్తిగా 2–2తో ముగించింది. బ్యాటర్‌గా 4 సెంచరీలు సహా ఏకంగా 754 పరుగులు చేసిన గిల్, ఇటు కెప్టెన్‌గా తొలి సిరీస్‌ను ఘనంగా ముగించాడు.
ఆ తర్వాత స్వదేశంలో బలహీన వెస్టిండీస్‌పై 2–0 సిరీస్ గెలుచుకోవడం ఎవరినీ ఆశ్చర్యపర్చలేదు. అయితే ఇంగ్లండ్ గడ్డపై వచి్చన పేరు కాస్తా సొంతగడ్డపై భారత జట్టు చేజార్చుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో టెస్టు సిరీస్‌ను కోల్పోవడం ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. మన గడ్డపై సఫారీల చేతిలో పాతికేళ్ల తర్వాత జట్టు సిరీస్ ఓడింది. ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఇదే తరహా 0–3 పరాజయాన్ని గుర్తుకు తెచి్చన టీమ్ మేనేజ్‌మెంట్ తీవ్ర విమర్శలకు గురైంది. కోచ్ గౌతమ్ గంభీర్ జట్టును నడిపిస్తున్న శైలిపై చర్చకు దారి తీసింది. మొత్తంగా ఈ ఏడాది 4 టెస్టులు గెలిచిన జట్టు 5 ఓడింది.
రోహిత్ ఖాతాలో మరో ఐసీసీ టైటిల్...
వన్డేల్లో భారత్ గుర్తుంచుకోదగ్గ ఏడాదిగా 2025 నిలిచింది. ముందుగా స్వదేశంలో ఇంగ్లండ్‌పై 3–0తో సిరీస్ గెలుచుకున్న టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటింది. వరుసగాఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ (బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌లపై) నెగ్గి విజేతగా నిలిచింది. 2013 తర్వాత భారత్ గెలుచుకున్న ఐసీసీ వన్డే టోర్నీ ఇదే కావడం విశేషం. 2024 టి20 వరల్డ్ కప్‌లో భారత్‌ను విజేతగా నిలిపిన రోహిత్ ఏడాది తిరిగేలోగా మరో ఐసీసీ ట్రోఫీని అందించి తన ఘనతను ప్రదర్శించాడు.

ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్‌లో అనూహ్యంగా రోహిత్‌ను తప్పించిన సెలక్టర్లు గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ సిరీస్‌ను జట్టు 1–2తో కోల్పోయింది. అయితే సరిగ్గా ఇక్కడి నుంచే రోహిత్, కోహ్లిల భవిష్యత్తుపై చర్చ మొదలైంది. కోహ్లి రెండు డకౌట్‌ల తర్వాత అర్ధసెంచరీ సాధించగా, రోహిత్ ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచి తన విలువను చూపించాడు.
అనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగి వన్డే సిరీస్‌ను జట్టు 2–1తో గెలుచుకుంది. అయితే ఈ సారి కోహ్లి వంతు వచ్చింది. 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీలతో 302 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలవడంతో కోహ్లి, రోహిత్‌ల గురించి చర్చకు ఫుల్‌స్టాప్ పడింది. మొత్తంగా 11 మ్యాచ్‌లు గెలిచిన టీమ్ 3 ఓడింది.
అభిషేక్ శర్మ అదరహో...
టి20 ఫార్మాట్‌లో 2024లో వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టు అదే జోరును ఈ ఏడాదీ కొనసాగించింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌పై 4–1తో సిరీస్, ఆ్రస్టేలియా గడ్డపై 2–1తో సిరీస్, మళ్లీ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 3–1 సిరీస్... ఇలా ఆడిన మూడు సిరీస్‌లూ జట్టు గెలుచుకుంది. వీటిలో రెండింటిలో వరుణ్ చక్రవర్తి, మరో దాంట్లో అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’లుగా నిలిచారు.
అయితే 2025లో హైలైట్‌గా నిలిచిన అంశం భారత జట్టు ఆసియా కప్ గెలుచుకోవడం. ఆడిన 7 మ్యాచ్‌లలో ఓటమి లేకుండా (వరుసగా యూఏఈ, పాకిస్తాన్, ఒమన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్‌లపై) అజేయంగా నిలిచి భారత్ టైటిల్ సాధించింది. 314 పరుగులతో అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ 53 బంతుల్లో అజేయంగా 69 పరుగులతో జట్టును గెలిపించి హీరోగా అవతరించాడు.
పహల్గాం దాడి తర్వాత జరిగిన ఈ టోర్నీలో పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత క్రికెటర్లు నిరాకరించడం, చివరకు ఆసియా కప్ ట్రోఫీని మన జట్టుకు అందించకుండా ఏసీసీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ తన వద్దే ఉంచుకోవడం టోర్నీని వివాదాస్పదంగా మార్చాయి. మొత్తంగా 16 మ్యాచ్‌లు గెలిచిన జట్టు 3 మాత్రమే ఓడింది. ఈ ఏడాది అభిషేక్ శర్మ ఓపెనర్‌గా చెలరేగి కొత్త స్టార్‌గా నిలిచాడు. 21 మ్యాచ్‌లు ఆడి 444 బంతులు ఎదుర్కొన్న అతను ఏకంగా 193.46 స్ట్రయిక్‌రేట్‌తో 859 పరుగులు చేసి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
హర్మన్ బృందానికి హ్యాట్సాఫ్...
ప్రపంచ కప్‌లో పది ప్రయత్నాల తర్వాత రెండుసార్లు రన్నరప్‌కే పరిమితమై, ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవకుండా సుదీర్ఘ కాలం ఎదురు చూసిన భారత మహిళల క్రికెట్ జట్టు చిరకాల స్వప్నం 2025లో నెరవేరింది. ఈ ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో తొలిసారి చాంపియన్‌గా సగర్వంగా శిఖరాన నిలిచింది. లీగ్ దశలో ఆడిన 7 మ్యాచ్‌లలో 3 విజయాలు, 3 పరాజయాలతో శ్రమించి జట్టు సెమీస్ చేరింది.
వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చేతుల్లో పరాజయాల తర్వాత ఇక నిష్క్రమణ ఖాయమనిపించిన దశలో హర్మన్ బృందం కోలుకున్న తీరు స్ఫూర్తిదాయకం. ఆపై సెమీఫైనల్లో అసాధారణ ఆటతో ఆస్ట్రేలియాను చిత్తు చేయడంతోనే ట్రోఫీపై ఆశలు చిగురించగా... నవంబర్ 2న జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగులతో గెలవడం భారత క్రికెట్ అభిమానులెవరూ మర్చిపోలేని ఘట్టం. హర్మన్, స్మృతి, జెమీమా, ప్రతీక, షఫాలీ, దీప్తి, శ్రీచరణి, క్రాంతి... ఇలా ప్రతీ ఒక్కరూ చేయి వేసి వరల్డ్ కప్‌ను భారత్‌కు అందించారు.
అండర్–19 వరల్డ్ కప్ కూడా మనదే...
ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరిలో మలేసియా వేదికగా జరిగిన అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. ఈ ఫార్మాట్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు 9 వికెట్లతో గెలిచింది. తెలంగాణకు చెందిన గొంగడి త్రిష 7 మ్యాచ్‌లు ఆడి 309 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును గెల్చుకుంది. భారత్‌కే చెందిన వైష్ణవి శర్మ (17 వికెట్లు) టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది.


