భారత పర్యటనకు న్యూజిలాండ్ జట్ల ప్రకటన
బ్రేస్‌వెల్‌కు వన్డే సారథ్య బాధ్యతలు
టి20 జట్టు కెప్టెన్‌గా సాంట్నర్
వెల్లింగ్టన్: విదేశీ లీగ్‌లు ఆడేందుకు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్... భారత్‌తో వన్డేసిరీస్‌కు దూరమయ్యాడు. వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌లో పర్యటించనున్న న్యూజిలాండ్ జట్టు.. ఈ టూర్‌లో భాగంగా మూడు వన్డేలు, 5 టి20లు ఆడనుంది. దీని కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. దక్షిణాఫ్రికా (ఎస్‌ఏ)20 లీగ్‌లో ఆడేందుకు గానూ విలియమ్సన్ ఈ సిరీస్‌కు దూరం కాగా... యువ ఆటగాళ్లకు న్యూజిలాండ్ బోర్డు పెద్దపీట వేసింది.
వన్డేల్లో మైకేల్ బ్రేస్‌వెల్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. పేసర్ కైల్ జేమీసన్ రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. ఎడంచేతి వాటం స్పిన్నర్ జేడెన్ లెనాక్స్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన సాంట్నర్ టి20ల్లో న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. క్రిస్టియన్ క్లార్క్, ఆదిత్య అశోక్, జోష్ క్లార్క్‌సన్, నిక్ కెల్లీ, మిచెల్ రే వంటి పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో న్యూజిలాండ్ బరిలోకి దిగనుంది.
జేడెన్ లెనాక్స్‌పై ఆ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. ‘న్యూజిలాండ్ ‘ఎ’ జట్టు తరఫున లెనాక్స్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. దానివల్లే అతడికి ఈ అవకాశం దక్కింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గత కొన్నాళ్లుగా అతడు నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు. దేశవాళీల్లో కనబర్చిన దూకుడే... అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిస్తాడనే నమ్మకముంది’ అని న్యూజిలాండ్ కోచ్ రోబ్ వాల్టర్ అన్నాడు. త్వరలో టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... గాయం నుంచి ఇప్పుడే కోలుకుంటున్న టామ్ లాథమ్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు.
దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన బెవాన్ జాక్స్, టిమ్ రాబిన్‌సన్ టి20 జట్టులో చోటు దక్కించుకున్నారు. జేమ్స్ నీషమ్, ఇష్ సోధి కూడా జట్టుకు ఎంపికయ్యారు. నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నెర్, మార్క్ చాప్‌మన్‌లను వన్డే జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోలేదు. టి20 జట్టులో మాత్రం చాప్‌మన్‌కు చోటు దక్కింది.
న్యూజిలాండ్ వన్డే జట్టు: బ్రేస్‌వెల్ (కెప్టెన్ ), ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్‌సన్, డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, కైల్ జేమీసన్, నిక్ కెల్లీ, జేడెన్ లెనాక్స్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ రే, విల్ యంగ్.
న్యూజిలాండ్ టి20 జట్టు: సాంట్నర్ (కెప్టెన్), బ్రేస్‌వెల్, చాప్‌మన్, కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, హెన్రీ, జేమీసన్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్‌సన్, ఇష్ సోధి.


