
ప్రపంచంలోని ఉత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరొందిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో కెప్టెన్సీ కోల్పోయిన ఈ కుడిచేతి వాటం ఆటగాడికి.. టీ20 జట్టులో స్థానం కూడా కరువైంది.
పేలవ ప్రదర్శన
అయితే, వన్డే, టెస్టుల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న బాబర్ ఆజం స్థాయికి తగ్గట్లు ఆడలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 56 పరుగులే చేసిన బాబర్.. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.
కనీసం ఒక్క సెంచరీ కూడా లేదు
లాహోర్ వేదికగా తొలి టెస్టులో బాబర్ రెండు ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులు 23, 47. ఇక రావల్పిండిలో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 16 పరుగులే చేసి నిష్క్రమించాడు. కాగా గత 75 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లో బాబర్ కనీసం ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు.
గత మూడేళ్ల కాలంలో టెస్టు క్రికెట్‌లో బాబర్ బ్యాటింగ్ సగటు 30కి తక్కువగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ పవర్ తగ్గిపోయిందని.. రిటైర్ అయితే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒత్తిడికి లోనవుతున్నాడు..
అయితే, పాకిస్తాన్ హెడ్‌కోచ్ అజర్ మహమూద్ మాత్రం బాబర్ ఆజంపై నమ్మకం ఉంచాడు. ‘‘ఒత్తిడి కారణంగానే ఇలా జరుగుతుంది. ప్రతి మ్యాచ్‌లోనూ బాబర్ రాణించాలని అంతా కోరుకుంటారు. దీంతో అతడు భారమంతా తనపైనే ఉందనే ఒత్తిడికి లోనవుతున్నాడు.
అతడొక అద్భుతమైన ప్లేయర్. ప్రపంచంలోని ఉత్తమ బ్యాటర్లలో ఒకడు. గత మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 40కి పైగా పరుగులు చేశాడు. ఒక్కసారి ఒత్తిడిని అధిగమించాడంటే.. కనీసం ఒక్క ఫిఫ్టీ చేసినా అతడు మళ్లీ గాడిలో పడతాడు’’ అని అజర్ మహమూద్ ధీమా వ్యక్తం చేశాడు.
కాగా తొలి టెస్టులో ఊహించని రీతిలో వరల్డ్‌చాంపియన్ సౌతాఫ్రికాకు షాకిచ్చిన పాకిస్తాన్.. 93 పరుగులు తేడాతో గెలిచింది. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులకు ఆలౌట్ అయిన పాక్.. సఫారీలను నిలువరించేందుకు గట్టిగానే కృషి చేస్తోంది.
చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషభ్ పంత్