December 6: టీమిండియాకు చాలా ప్రత్యేకమైన రోజు | Ravindra Jadeja, Bumrah, Shreyas Iyer Celebrating Birthdays on December 6 | Sakshi
Sakshi News home page

December 6: టీమిండియాకు చాలా ప్రత్యేకమైన రోజు

Dec 6 2025 7:48 AM | Updated on Dec 6 2025 7:48 AM

Ravindra Jadeja, Bumrah, Shreyas Iyer Celebrating Birthdays on December 6

భారత క్రికెట్‌కు డిసెంబర్‌ 6 (December 6) చాలా ప్రత్యేకమైన రోజు. ఇవాళ ముగ్గురు టీమిండియా స్టార్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దిగ్గజ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా, అత్యుత్తమ మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ వేర్వేరు సంవత్సరాల్లో డిసెంబర్‌ 6న జన్మించారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యులుగా ఉన్నారు.

ఈ ముగ్గురిలో సీనియర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja). ఎడమ చేతి స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన జడేజా 1988లో గుజరాత్‌లోని నవ్‌గామ్‌ఘడ్‌లో జన్మించాడు. 2008 అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన జడేజా 2009లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.

2008-09 రంజీ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన (42 వికెట్లు, 739 పరుగులు) కారణంగా జడ్డూకు టీమిండియా ఆఫర్‌ వచ్చింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 3 ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడు జడేజా.

2024 టీ20 ప్రపంచకప్‌ విజయం తర్వాత జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి, ప్రస్తుతం భారత టెస్ట్‌, వన్డే జట్లలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు.

పై ముగ్గురిలో జడ్డూ తర్వాత సీనియర్‌ బుమ్రా (Jasprit Bumrah). ఈ కుడి చేతి వాటం పేసు గుర్రం 1993లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించాడు. విశిష్టమైన బౌలింగ్‌ శైలి కలిగిన బుమ్రా.. తనకు మాత్రమే సాధ్యమైన స్వింగ్‌ మరియు పేస్‌ కలయికతో ప్రపంచ బ్యాటర్లను వణికిస్తున్నాడు.

ఐపీఎల్‌లో సత్తా చాటడం ద్వారా 2016 టీమిండియా తలుపులు తట్టిన బుమ్రా అనతికాలంలో సూపర్‌ స్టార్‌ బౌలర్‌ అయ్యాడు. భారత పేసు గుర్రంగా పేరు తెచ్చుకున్నాడు. బుమ్రా యార్కర్లు వేయడంలో దిట్ట. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చివరి ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యానికి బుమ్రా ప్రసిద్ది చెందాడు.

గతేడాది ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్న బుమ్రా, టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. గతేడాది భారత్‌ టీ20 ప్రపంచకప్‌ సాధించడంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు. విదేశీ పిచ్‌లు.. ముఖ్యంగా SENA దేశాల్లో ఫాస్ట్‌ బౌలింగ్‌ పిచ్‌లపై బుమ్రాకు ఎవరికీ లేని ట్రాక్‌ రికార్డు ఉంది.

పై ముగ్గురిలో చిన్నవాడు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer). శ్రేయస్‌ 1994లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు. కుడి చేతి వాటం మిడిలార్డర్‌ బ్యాటర్‌ అయిన శ్రేయస్‌ 2014 అండర్‌-19 వరల్డ్‌కప్‌ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆతర్వాత దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటి 2017లో టీమిండియా తలుపులు తట్టాడు. 

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శ్రేయస్‌ మిడిలార్డర్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాను చాలా మ్యాచ్‌ల్లో గెలిపించాడు. జాతీయ జట్టులో పోలిస్తే శ్రేయస్‌కు ఐపీఎల్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. 2024లో కేకేఆర్‌కు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ 2025 సీజన్‌లో పంజాబ్‌ను.. అంతకుముందు ఢిల్లీని ఫైనల్‌కు చేర్చాడు. 

2023 వరల్డ్‌కప్‌లో 500పైగా పరుగులు చేసి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన శ్రేయస్‌.. టీమిండియా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవడంలోనూ ప్రధానపాత్ర పోషించాడు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా తీవ్రంగా గాయపడిన శ్రేయస్‌.. ప్రస్తుతం కోలుకునే క్రమంలో ఉన్నాడు.

పై ముగ్గురితో పాటు డిసెంబర్‌ 6న ఆర్పీ సింగ్‌, కరుణ్‌ నాయర్‌, అన్షుల్‌ కంబోజ్‌, హ్యారీ టెక్టార్‌, గ్లెన్‌ ఫిలిప్‌ లాంటి స్టార్‌ క్రికెటర్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement