
ఆసియా కప్-2025 ట్రోఫీ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మన్, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ భారత క్రికెట్ బోర్డు దెబ్బకు దిగొచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. జీ న్యూస్ కథనం ప్రకారం.. నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేసినట్లు సమాచారం.
తాజాగా జరిగిన ఏసీసీ సమావేశంలో ఈ విషయంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అయితే ట్రోఫీ కావాలంటే భారత కెప్టెన్ నేరుగా ఏసీసీ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని నఖ్వీ చెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.
కానీ ఇప్పుడు నఖ్వీ వెనక్కి తగ్గి ట్రోఫీ యూఏఈ క్రికెట్ బోర్డు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఈ విషయంపై బీసీసీఐ గానీ, యూఏఈ క్రికెట్ బోర్డు గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఈ ఏడాది ఆసియాకప్ యూఏఈ ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.
అసలేంటి ఈ ట్రోఫీ వివాదం..?
ఆసియాకప్ విజేతగా నిలిచిన అనంతరం ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని తీసుకోవడానికి భారత్ నిరాకరించింది. నఖ్వీ ఏసీసీ చైర్మెన్‌తో పాటు పీసీబీ ఛీప్, పాకిస్తాన్ మంత్రిగా ఉండడమే ఇందుకు కారణం.
అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్, యూఏఈ క్రికెట్ బోర్డు చైర్మెన్ చేతులు మీదగా ట్రోఫీని తీసుకుంటామని టీమిండియా తెలియజేసింది. కానీ అందుకు నఖ్వీ అంగీకరించలేదు. దీంతో అతడు ట్రోఫీని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు.
అప్పటి నుంచి ఆసియాకప్ ట్రోఫీ అతడి వద్దే ఉంది. కాగా ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌ను 5 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ టోర్నీ అంతటా పాక్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు షేక్ హ్యాండ్ చేయడానికి నిరకారించారు. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.
చదవండి: IND vs AUS: ఆసీస్‌పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్