భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు జెంటిల్‌మ్యాన్ గేమ్ క్రికెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను రిలీజ్ చేయడంతో మొదలైన వివాదం.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌నకు పాకింది. తమ జట్టు భద్రత దృష్ట్యా భారత్‌లో వరల్డ్‌కప్ మ్యాచులు ఆడేందుకు సిద్ధంగా లేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
కోల్‌కతా, ముంబైలలో జరగాల్సిన తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ను బీసీబీ కోరింది. అయితే అందుకు ఐసీసీ విముఖత చూపినట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇక ఇదే విషయంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
"బంగ్లాదేశ్‌లో గత కొన్ని రోజులగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నా. అయితే భారత్ ఎప్పుడూ అందరిని హృదయపూర్వంగా ఆహ్వానిస్తుంది. మేము ప్రతీ ఒక్కరికి ఆతిథ్యమిచ్చేందుకు సిద్దంగా ఉంటాము. కానీ భారత్‌కు రావాలా వద్దా అనేది బంగ్లాదేశ్ ఇష్టం. దీనిపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకోవాలి" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ తెలిపాడు.
వివాదం అక్కడే..
ఐపీఎల్-2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో..ఆ దేశ ప్లేయర్లను ఐపీఎల్ నుంచి బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో కేకేఆర్ యాజమాన్యంపై కూడా విమర్శలు గుప్పించారు. దీంతో రంగంలోకి దిగిన బీసీసీఐ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీని ఆదేశించింది. దీంతో కేకేఆర్ అతడిని రిలీజ్ చేసింది. అప్పటి నుంచి ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. బంగ్లా ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా బ్యాన్ చేసింది.
చదవండి: కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్


