
త్వరలో స్వదేశంలో సౌతాఫ్రికా-ఏతో జరుగబోయే రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల కోసం రెండు వేర్వేరు భారత-ఏ జట్లను ఇవాళ (అక్టోబర్ 21) ప్రకటించారు. రెండు జట్లకు రిషబ్ పంత్ కెప్టెన్‌గా, సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.
ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన పంత్ ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, మొహమ్మద్ సిరాజ్ రెండో టెస్ట్ జట్టుకు మాత్రమే ఎంపికయ్యారు.
కాగా, ఈ రెండు జట్లలో ఇన్ ఫామ్ ఆటగాళ్లు మహ్మద్ షమీ (Mohammed Shami), సర్ఫరాజ్ ఖాన్‌కు (Sarfaraz Khan) చోటు దక్కకపోవడం అందరికీ ఆశ్యర్యాన్ని కలిగించింది. షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకొని తాజాగా ముగిసిన రంజీ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. వాస్తవానికి షమీ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులోనే చోటు ఆశించాడు.
అయితే ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ లేదన్న కారణం చెప్పి సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు సౌతాఫ్రికా-ఏతో సిరీస్‌కు కూడా షమీని ఎంపిక చేయకపోవడంతో సెలెక్టర్లపై విమర్శలు వస్తున్నాయి. ఫిట్‌గా ఉండి, ఫామ్‌లో ఉన్నా షమీని సౌతాఫ్రికా-ఏతో సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని అభిమానులు నిలదీస్తున్నారు.
మరోవైపు యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ సెలెక్టర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో పాటు అంచనాలకు మించి బరువు తగ్గి, ఫామ్‌ను చాటుకున్న సర్ఫరాజ్ ఖాన్‌ను సౌతాఫ్రికా-ఏతో సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. సర్ఫరాజ్ తాజాగా ముగిసిన రంజీ మ్యాచ్‌లో 74 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.
అంతకుముందు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆథ్వర్యంలో జరిగిన బుచ్చిబాబు టోర్నీలో వరుసగా రెండు సెంచరీలు చేశాడు. దీనికి ముందు భారత్-ఏ తరఫున కూడా సర్ఫరాజ్ సత్తా చాటాడు. ఇంగ్లండ్ పర్యటన తొలి మ్యాచ్‌లో 92 పరుగులు చేశాడు.
ఇంత చేసినా సర్ఫరాజ్‌ను ఏ జట్టుకు కూడా ఎంపిక చేయకపోవడం విచారకరమని అభిమానులు అంటున్నారు. సర్ఫరాజ్, షమీ.. ఏం నేరం చేశారని వారికి అవకాశాలు ఇవ్వడం లేదని అభిమానులు సెలెక్టర్ల నిలదీస్తున్నారు.
సౌతాఫ్రికా-ఏతో తొలి మ్యాచ్‌కు భారత జట్టు (అక్టోబరు 30- నవంబరు 2):
రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, సారాంశ్ జైన్.
సౌతాఫ్రికా-ఏతో రెండో మ్యాచ్‌కు భారత జట్టు (నవంబరు 6- నవంబరు 9):
రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.