ప్రిటోరియస్ (PC: X)
భారత్‌తో మూడో అనధికారిక వన్డేలో సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు (IND A vs SA A) భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు శతక్కొట్టడంతో నిర్ణీత యాభై ఓవర్లలో ఏకంగా 325 పరుగులు చేసింది. కాగా రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది.
ఇందులో భాగంగా భారత్-‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసిన సఫారీ జట్టు.. వన్డే సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. తొలి, రెండో వన్డేలో తిలక్ వర్మ సేన చేతిలో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా బుధవారం నాటి నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు బ్యాటింగ్‌తో అదరగొట్టింది.
శతక్కొట్టిన ఓపెనర్లు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్-‘ఎ’ జట్టు ప్రొటిస్ టీమ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు లువాన్ డ్రి ప్రిటోరియస్, రివాల్డో మూన్‌సామీ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రిటోరియస్ 98 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఏకంగా 123 పరుగులు చేయగా.. మూన్‌సామీ 130 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 107 పరుగులు సాధించాడు.
మిగతా అంతా ఫెయిల్
విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన ఈ ఓపెనింగ్ జోడీని భారత పేసర్ ప్రసిద్ కృష్ణ విడదీశాడు. దీంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ నెమ్మదించింది. మిగతా వాళ్లంతా పెలివియన్‌కు క్యూ కట్టారు. రుబిన్ హెర్మాన్ (11), సినెతెంబ కెషిలె (1), కెప్టెన్ మార్క్వెస్ అకెర్మాన్ (16) పూర్తిగా విఫలం కాగా.. డియాన్ ఫోరెస్టర్ 20, డిలానో పాట్‌గిటర్ 30 (నాటౌట్) ఫర్వాలేదనిపించారు. డిజోర్న్ ఫార్చ్యూన్ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఫలితంగా సౌతాఫ్రికా-‘ఎ’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో పేసర్లు ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా తలా రెండేసి వికెట్లు కూల్చారు.


