నితీశ్ రాణా అవుట్.. రాజస్తాన్ జట్టులోకి చిచ్చర పిడుగు
ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన రాజస్తాన్ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ నితీశ్ రాణా (Nitish Rana) గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లన్నిటికీ దూరమయ్యాడు. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ ఈ విషయాన్ని గురువారం ధ్రువీకరించింది.నితీశ్ రాణా స్థానంలో సౌతాఫ్రికా బ్యాటర్ లువాన్ డ్రి ప్రిటోరియస్ (Lhuan-dre Pretorius)ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. రూ. 30 లక్షల కనీస ధరతో అతడిని సొంతం చేసుకున్నట్లు తెలిపింది. కాగా 19 ఏళ్ల ప్రిటోరియస్ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడి.. 911 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఇప్పటి వరకు సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 97.చిచ్చర పిడుగేఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ప్రిటోరియస్.. వికెట్ కీపర్‌గా కూడా! సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో రాజస్తాన్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఈ ఏడాది లీగ్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.ఎస్ఏటీ20- 2025లో ప్రిటోరియస్ 12 మ్యాచ్‌లలో కలిపి 166కు పైగా స్ట్రైక్‌రేటుతో 397 పరుగులు సాధించాడు. సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ జట్టుపై 51 బంతుల్లో 97 పరుగులు సాధించిన తీరు అతడి కెరీర్లో హైలైట్‌గా నిలిచింది. ఇక కౌంటీల్లో విటలిటి బ్లాస్ట్‌తో కూడా అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా గతేడాది అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్లోనూ సౌతాఫ్రికా తరఫున ప్రిటోరియస్ టాప్ రన్ స్కోరర్‌గా నిలవడం విశేషం.ఆది నుంచే షాకులుఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆది నుంచే షాకులు తగులుతున్నాయి. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ గాయం కారణంగా వీల్‌చైర్ నుంచే మార్గదర్శనం చేస్తున్నాడు. ఇక తొలి మూడు మ్యాచ్‌లకు కెప్టెన్ సంజూ శాంసన్ ఫిట్నెస్ లేని కారణంగా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినా గాయంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు.ఇక సంజూ గైర్హాజరీలో రియాన్ పరాగ్ రాజస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. ఇప్పటికి రాయల్స్ ఆడిన 12 మ్యాచ్‌లలో ఏకంగా తొమ్మిది ఓడి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ సీజన్లో జట్టుకు ఇంకా రెండు మ్యాచ్ (చెన్నై, పంజాబ్)లు మిగిలి ఉన్నాయి. కాగా నితీశ్ రాణా ఈ సీజన్లో పదకొండు మ్యాచ్‌లు ఆడి 217 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 81.పడిక్కల్ స్థానంలో మయాంక్ అగర్వాల్గాయం కారణగా ఐపీఎల్‌కు దూరమైన దేవదత్ పడిక్కల్ స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు... భారత ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసుకుంది. తాజా సీజన్లో 10 మ్యాచ్‌లాడి 247 పరుగులు చేసిన పడిక్కల్ కండరాలు పట్టేయడంతో మిగిలిన సీజన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో కర్ణాటకకే చెందిన మయాంక్‌ను 1 కోటి రూపాయల ధరతో ఆర్సీబీ తీసుకుంది.మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అఫ్గానిస్తాన్ ప్లేయర్ సాదిఖుల్లాను జట్టులోకి తీసుకుంది. ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ స్థానంలో 23 ఏళ్ల సాదిఖ్‌ను ఎంపిక చేసుకుంది. అతను 49 టి20ల్లో 1507 పరుగులు చేశాడు. వేలంలో అమ్ముడుపోయిన తర్వాత ఐపీఎల్లో ఆడేందుకు నిరాకరించడంతో బ్రూక్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. చదవండి: అతడికి థాంక్యూ.. అద్భుతంగా ఆడాడు.. ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాతే..: ధోని