అరంగేట్రంలోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా టీనేజర్‌ | ZIM vs SA: Lhuan Dre Pretorius Slams Century On Test Debut Creates History | Sakshi
Sakshi News home page

అరంగేట్రంలోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా టీనేజర్‌

Jun 28 2025 9:32 PM | Updated on Jun 28 2025 9:34 PM

ZIM vs SA: Lhuan Dre Pretorius Slams Century On Test Debut Creates History

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిన్‌షిప్‌ నయా చాంపియన్‌ సౌతాఫ్రికా కొత్త సీజన్‌ మొదలుపెట్టింది. డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా తొలుత జింబాబ్వేతో తలపడుతోంది. రెగ్యులర్‌ కెప్టెన​ టెంబా బవుమా ఈ సిరీస్‌కు దూరం కాగా.. కేశవ్‌ మహరాజ్‌ (Keshav Maharaj) సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

ఇక రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వే- సౌతాఫ్రికా (ZIM vs SA) మధ్య శనివారం తొలి టెస్టు ఆరంభమైంది. బులవాయోలోని క్వీన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో టాస్‌ గెలిచిన పర్యాటక సౌతాఫ్రికా జట్టు.. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

కుప్పకూలిన టాపార్డర్‌
ఈ క్రమంలో ఆతిథ్య జింబాబ్వే బౌలర్లు ధాటిగా తమ అటాకింగ్‌ ఆరంభించారు. టనకా చివాంగ దెబ్బకు ఓపెనర్లు టోనీ డి జోర్జి (0), మాథ్యూ బ్రీట్జ్కే (13) త్వరత్వరగా పెవిలియన్‌ చేరారు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ వియాన్‌ ముల్దర్‌ (17) రనౌట్‌ కాగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ డేవిడ్‌ బెడింగ్‌హామ్‌ ​కూడా పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.

లువాన్‌-డ్రి ప్రిటోరియస్‌, బాష్‌ శతకాలు
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అరంగేట్ర బ్యాటర్‌ లువాన్‌-డ్రి ప్రిటోరియస్‌ (Lhuan-Dre Pretorius) భారీ శతకంతో సత్తా చాటాడు. మొత్తంగా 160 బంతులు ఎదుర్కొన్న పందొమిదేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 153 పరుగులు సాధించాడు. ఇతడికి తోడుగా చిచ్చరపిడుగు డెవాల్డ్‌ బ్రెవిస్‌ (51) అర్ధ శతకంతో మెరవగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కైలీ వెరెన్నె (10) మాత్రం నిరాశపరిచాడు.

అయితే, బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కార్బిన్‌ బాష్‌ కూడా శతకంతో చెలరేగడం విశేషం. మిగతా వాళ్లలో కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌ 21, కోడీ యూసఫ్‌ 27 పరుగులు చేశారు. శనివారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి 90 ఓవర్లలో సౌతాఫ్రికా తొమ్మిది వికెట్ల నష్టానికి 418 పరుగులు సాధించింది. బాష్‌ 100, క్వెనా మఫాకా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

చరిత్ర సృష్టించిన ప్రిటోరియస్‌
జింబాబ్వేతో మ్యాచ్‌లో శతక్కొట్టిన లువాన్‌-డ్రి ప్రిటోరియస్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికా తరఫున పురుషుల క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు.. అరంగేట్రంలోనే టెస్టుల్లో శతకం బాదిన అత్యంత పిన్న వయస్కుడిగానూ నిలవడం విశేషం.

ఈ క్రమంలో సౌతాఫ్రికా తరఫున 61 ఏళ్లుగా గ్రేమ్‌ పొలాక్‌ పేరిట ఉన్న రికార్డును ప్రిటోరియస్‌ బద్దలు కొట్టాడు. 1964లో ఆస్ట్రేలియా మీద 19 ఏళ్ల 317 రోజుల్లో పొలాక్‌ సెంచరీ చేయగా.. ప్రిటోరియస్‌ 19 ఏళ్ల 93 రోజుల వయసులో జింబాబ్వే మీద ఈ ఘనత సాధించాడు.

చదవండి: నితీశ్‌ రెడ్డి కాదు!.. శార్దూల్‌ స్థానంలో అతడే సరైనోడు: భారత మాజీ క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement