జోహన్నెస్‌బర్గ్ వేదికగా బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ తుది జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బవుమా నాయకత్వం వహించనున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించినప్పటికి.. సౌతాఫ్రికా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెరో మార్పు చేసింది.
బెడింగ్‌హామ్‌పై వేటు.. జుబేర్ హంజాకు చోటు
తుది జట్టులో జరిగిన ప్రధాన మార్పుల్లో డేవిడ్ బెడింగ్‌హామ్‌ను పక్కన పెట్టడం ఒకటి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 5 ఇన్నింగ్స్‌లలో 31.20 సగటుతో 156 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
దీంతో ఈ సిరీస్ స్క్వాడ్ నుంచే అతడిని తప్పించి, ఆ స్థానంలో 31 ఏళ్ల జుబేర్ హంజాకు అవకాశం కల్పించారు. హంజా దాదాపు రెండేళ్ల తర్వాత ప్రోటీస్ జట్టులోకి తిరిగొచ్చాడు. కాగా ఇటీవల బంగ్లాదేశ్-ఏ జట్టుతో జరిగిన సౌతాఫ్రికా-ఏ సిరీస్‌లో (2 ఇన్నింగ్స్‌లలో 146 పరుగులు) అద్భుతంగా రాణించడంతో అతడికి అవకాశం కలిసొచ్చింది.
కోయెట్జీ స్థానంలో డేన్ ప్యాటర్సన్
బౌలింగ్ విభాగంలో పేసర్ గెరాల్డ్ కోయెట్జీ స్థానంలో డేన్ ప్యాటర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా ఆన్రిచ్ నోర్ట్జే తొలి టెస్టుకు దూరమవడంతో, కగిసో రబాడ, మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్‌లతో కలిసి ప్యాటర్సన్ పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు. స్పిన్నర్‌గా సైమన్ హార్మర్ ఒక్కడే జట్టులో ఉన్నాడు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు దక్షిణాఫ్రికా తుది జట్టు:
ఐడెన్ మార్క్రామ్, మార్కస్ అకెర్మాన్, జుబేర్ హంజా, టెంబా బవుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, సైమన్ హార్మర్, కగిసో రబాడ, డేన్ ప్యాటర్సన్.


