ఇంగ్లండ్-జింబాబ్వే మధ్య చారిత్రత్మక టెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్దమవుతోంది. దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టు జింబాబ్వేలో పర్యటించనున్నట్లు తెలస్తోంది. ఈ టూర్‌లో భాగంగా ఇంగ్లీష్ జట్టు ఆతిథ్య జింబాబ్వేతో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనున్నట్లు సమాచారం. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఐసీసీ త్రైమాసిక సమావేశంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఈ పర్యటనకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా 1996 తర్వాత ఇంగ్లండ్ జట్టు జింబాబ్వేలో టెస్టు మ్యాచ్ ఆడనుండటం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన అధికారిక తేదీలను ఇరు దేశాల బోర్డులు త్వరలోనే ప్రకటించనున్నాయి. విక్టోరియా ఫాల్స్‌లోని 'మోసి-ఓవా-తున్యా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం' ఈ చారిత్రత్మక మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్నట్లు జింబాబ్వే క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
గతంలో ఇంగ్లండ్-జింబాబ్వే మధ్య క్రికెట్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. అప్పట్లో జింబాబ్వే ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఆ దేశంతో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను ఈసీబీ రద్దు చేసుకుంది. జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2003 వన్డే ప్రపంచకప్‌లో, భద్రతా కారణాలను చూపుతూ హరారేలో ఆడేందుకు ఇంగ్లండ్ నిరాకరించింది. దీంతో ఐసీసీ ఆ మ్యాచ్ పాయింట్లను జింబాబ్వేకు కేటాయించగా, వారు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. ఇంగ్లండ్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
ఆ తర్వాత 2008లో జింబాబ్వేతో అన్ని రకాల క్రికెట్ సంబంధాలను నిలిపివేస్తున్నట్లు ఈసీబీ అధికారికంగా ప్రకటించింది. 2009లో జింబాబ్వే జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉండగా, ఆ సిరీస్‌ను కూడా రద్దు చేసింది.
అయితే సుదీర్ఘ విరామం తర్వాత, గతేడాది మే నెలలో ఇంగ్లండ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇప్పుడు ఏకంగా జింబాబ్వే గడ్డపైనే ఇంగ్లండ్ ఆడనుండటం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


