
ఆసియా కప్-2025 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడాన్ని పీసీబీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో భారత్, పాక్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft)ను తక్షణం ఆసియా కప్ నుంచి తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది.
ఆయనే బాధ్యుడంటూ..
ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు ఫిర్యాదు కూడా చేసింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు చెప్పాడని, ఈ వివాదానికి ఆయనే బాధ్యుడని ఫిర్యాదులో ప్రముఖంగా పేర్కొంది.
ఈ విషయంపై మంగళవారం స్పందించిన ఐసీసీ పాక్ బోర్డు ఫిర్యాదును తోసిపుచ్చింది. ‘సోమవారం రాత్రే ఐసీసీ తమ నిర్ణయాన్ని వెలువరించింది. రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ను తప్పించలేమని పాక్ బోర్డు ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశాం’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.
కాగా జింబాబ్వేకు చెందిన పైక్రాఫ్ట్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో విశేషానుభవం వుంది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో సీనియర్ రిఫరీ అయిన ఆయన మూడు ఫార్మాట్లలో కలిసి 695 మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు. పురుషులు, మహిళల మ్యాచ్‌లు కలిపి ఉన్నాయి.
ఐసీసీ యూటర్న్.. పాక్‌కు ఊరట?!
ఈ నేపథ్యంలో కనీసం తమ మ్యాచ్‌ల వరకైనా ఆండీ క్రాఫ్ట్‌ను దూరం పెట్టి రిచీ రిచర్డ్‌సన్‌కు రిఫరీ బాధ్యతలు ఇవ్వాలని పీసీబీ కోరింది. కాగా ఆసియా కప్ టోర్నీలో బుధవారం పాకిస్తాన్- యూఏఈ మధ్య జరిగే మ్యాచ్‌కూ పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. అయితే, పీసీబీ విజ్ఞప్తిని మన్నించిన ఐసీసీ.. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడబోయే అన్ని మ్యాచ్‌ల నుంచి పైక్రాఫ్ట్‌ను రిఫరీగా తప్పించినట్లు ఎన్డీటీవీ తన తాజా కథనంలో పేర్కొంది.
కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేయలేదు.
కచ్చితమైన నిబంధనలేమీ లేవు
ఈ నేపథ్యంలో పీసీబీ రిఫరీతో పాటు టీమిండియా తీరును తప్పుబట్టగా.. ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న కచ్చితమైన నిబంధనలేమీ లేవని బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది.
ఇక దుబాయ్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయంటూ పాక్ విమర్శలను తిప్పికొట్టాడు.
పాక్‌పై ఈ గెలుపును ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సూర్య స్పష్టం చేశాడు.
చదవండి: సూర్యకుమార్‌పై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్