
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహ్మద్ యూసఫ్ (Mohammed Yousuf)పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ మండిపడ్డాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్ నుంచి ఇలాంటి చెత్త మాటలు ఊహించలేదన్నాడు. అయినా అతడి స్థాయికి ఇంతకంటే గొప్పగా మాట్లాడతాడనుకోలేదంటూ చురకలు అంటించాడు.
ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా టీమిండియా ఆదివారం పాక్‌తో మ్యాచ్ ఆడింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టీ20 పోరులో సూర్యకుమార్ సేన సల్మాన్ ఆఘా బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
బీసీసీఐ కౌంటర్
అయితే, టాస్ సమయంలోగానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత గానీ భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మద్దతుగా పాక్ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్‌కు నిరాకరించింది.
దీనిని అవమానంగా భావించిన పాక్ జట్టు.. విషయాన్ని ఐసీసీ వరకు తీసుకువెళ్లగా.. కచ్చితంగా షేక్‌హ్యాండ్ చేయాలన్న నిబంధన లేదంటూ బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ మొహ్మద్ యూసఫ్ టీమిండియాపై అవాకులు, చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కాడు.
సూర్య పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పుగా పలుకుతూ
షేక్‌హ్యాండ్ గురించి సామా టీవీలో మాట్లాడుతూ.. సూర్యకుమార్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సూర్య పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పుగా పలుకుతూ పంది అనే అర్థం వచ్చేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు అంపైర్లను అడ్డుపెట్టుకుని గెలిచారంటూ నిరాధార ఆరోపణలు చేశాడు. అతడి మాటలకు అక్కడున్న వాళ్లు పళ్ళు ఇకిలిస్తూ శునకానందం పొందారు.
ఇంతకంటే ఇంకా ఎంతకు దిగజారగలరు?
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ స్పందించాడు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇంతకంటే ఇంకా ఎంతకు దిగజారగలరు? వాళ్లు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతూనే ఉంటారు.
మైదానంలో ఏం చేయాలో మాత్రం అది చేయరు. కానీ మైదానం వెలుపల ఇలాంటి పిచ్చి మాటలతో హైలైట్ అవుతారు. ప్రపంచం మొత్తం వీరిని గమనిస్తూనే ఉంది. ఇంతకంటే టీమిండియాను వారు ఏం చేయగలరు?
ప్రతి ఒక్కరికి తమకంటూ గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే వారు ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చు. అయినా.. ఎవరైనా సరే తమ స్థాయికి తగ్గట్లే మాట్లాడతారు కదా!
మా జట్టు గొప్పగా ఆడుతోంది
ఆట గురించి ఎలాంటి విమర్శలు చేసినా తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఇలా చేయడం ముమ్మాటికీ తప్పే. మీరు ఏదైనామాట్లాడాలనుకుంటే ఆట గురించి మాట్లాడండి. మా జట్టు గొప్పగా ఆడుతోంది. మీ ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి.
క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెట్టి.. బాగా ఆడితే మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు పొగుడుతారు. అంతేగానీ ఇతర జట్ల ఆటగాళ్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అంటూ అశోక్ అస్వాల్కర్ మొహ్మద్ యూసఫ్‌నకు గట్టిగానే చురకలు అంటించాడు.
చదవండి: టీమిండియా ‘బిగ్ లూజర్’ అంటూ కామెంట్లు?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్