
టీమిండియా- పాకిస్తాన్ మధ్య ‘నో-షేక్‌హ్యాండ్ No- Shakehand)’ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా దాయాదులు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.
అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత జట్టు నిరాకరించింది. షేక్‌హ్యాండ్ లేకుండానే డ్రెసింగ్ రూమ్‌కు వెళ్లిపోయింది. ఈ క్రమంలో తమను అవమానించారంటూ పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది.
మరోవైపు.. షేక్‌హ్యాండ్ చేయాలన్న నిబంధన లేదని.. తమ ఆటగాళ్లు చేసిన దాంట్లో తప్పేమీ లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీమిండియాను సమర్థిస్తూ భారత మాజీ క్రికెటర్లు వ్యాఖ్యలు చేయగా.. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ మాత్రం సూర్యకుమార్ సేనను విమర్శించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
టీమిండియా ‘బిగ్ లూజర్’?
‘‘ఈ మ్యాచ్ ఎల్లకాలం గుర్తుండిపోతుంది. ఇండియా బిగ్ లూజర్‌గా మనకు గుర్తుంటుంది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు వెళ్లిన పాకిస్తానీ జట్టు ప్రవర్తన జెంటిల్‌మేన్ గేమ్‌లో వాళ్లను అమరులుగా నిలిపితే.. భారత జట్టు మాత్రం పరాజితగా మిగిలిపోతుంది’’ అని పాంటింగ్ అన్నట్లుగా పాక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
అసలు అలాంటి కామెంట్లు చేయనేలేదు
ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్‌పై భారతీయ నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో పాంటింగ్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు. ‘‘సోషల్ మీడియాలో నా పేరు చెప్పి వైరల్ అవుతున్న వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి.
నేను అసలు అలాంటి కామెంట్లు చేయనేలేదు. అసలు ఆసియా కప్ టోర్నమెంట్ గురించి నేను ఇంత వరకు బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడనే లేదు’’ అంటూ పాక్ నెటిజన్లకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ‘ఎక్స్’ వేదికగా పాంటింగ్ ఈ మేరకు స్పష్టతనిచ్చాడు.
ఐపీఎల్‌తో విడదీయరాని అనుబంధం
కాగా ఆసీస్ దిగ్గజ కెప్టెన్‌గా పేరొందిన పాంటింగ్‌కు ఐపీఎల్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు హెడ్‌కోచ్‌గా పనిచేసిన ఈ లెజెండరీ బ్యాటర్.. గతేడాది పంజాబ్ కింగ్స్‌కు మార్గనిర్దేశనం చేశాడు. అతడి గైడెన్స్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ ఫైనల్ చేరింది. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.