
వెస్టిండీస్ క్రికెట్ జట్టు (West Indies) సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది. ఓ వన్డే మ్యాచ్‌లో తొలి ఐదుగురితో స్పిన్ బౌలింగ్ వేయించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు.
తొలి నలుగురితో స్పిన్ బౌలింగ్ చేయించిన దాఖలాలు (ఐదు సందర్భాల్లో) ఉన్నా, అవి అసోసియేట్ దేశాల క్రికెట్‌లో జరిగాయి. ఓ ఫుల్ మెంబర్ జట్టు తొలి ఐదుగురి బౌలర్లతో స్పిన్ వేయించడం మాత్రం వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో (Bangladesh Vs West Indies) ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. విండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ తొలుత బౌలింగ్ చేస్తూ.. ఐదుగురు స్పిన్నర్లను ప్రయోగించాడు. రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లతోనే దాడి ప్రారంభించాడు. ఇలా జరగడం కూడా వన్డే క్రికెట్ చరిత్రలో ఐదోసారి మాత్రమే.
గత మూడు ఘటనలు ఇదే వేదికగా జరిగాయి. మూడు సందర్భాల్లో కూడా బంగ్లాదేశే ఈ ప్రయోగాన్ని చేసింది. న్యూజిలాండ్ జట్టు వన్డే క్రికెట్‌లో తొలిసారి ఈ ప్రయోగాన్ని చేసిన జట్టుగా నిలిచింది. 2017లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లతో (జీతన్ పటేల్, సాంట్నర్) బౌలింగ్ ప్రారంభించింది.
మ్యాచ్ విషయానికొస్తే.. ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటుంది. ఇవాళ (అక్టోబర్ 21) జరుగుతున్న మ్యాచ్‌కు సంబంధించిన పిచ్ కూడా అలాగే ఉంది. దీంతో తొలుత బౌలింగ్ చేయాల్సి వచ్చిన విండీస్ కేవలం స్పిన్నర్లతోనే బరిలోకి దిగింది.
అకీల్ హోసేన్, రోస్టన్ ఛేజ్‌తో బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించిన విండీస్.. ఆతర్వాత కూడా స్పిన్నర్లనే (ఖారీ పియెర్రీ, గుడకేశ్ మోటీ, అలిక్ అథనాజ్) కొనసాగించింది. అంచనాలకు తగ్గట్టుగానే విండీస్ స్పిన్నర్లు చెలరేగిపోయారు.
ఆతిథ్య జట్టును 213 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు. మోటీ 3, అకీల్ హోసేన్, అలిక్ అథనాజ్ తలో 2 వికెట్లు తీశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో 45 పరుగులు చేసిన సౌమ్య సర్కార్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో రిషద్ హొసేన్ (39 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
విండీస్ ప్రపంచ రికార్డు
రెండు వైపుల నుంచి బౌలింగ్ అటాక్‌ను స్పిన్నర్లతోనే ప్రారంభించి, ఆతర్వాత కూడా మరో ముగ్గురు స్పిన్నర్లనే కొనసాగించి, ఓ వన్డే మ్యాచ్‌లో తొలి ఐదుగురు బౌలర్లతో స్పిన్ వేయించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ మరో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది. వన్డే క్రికెట్ చరిత్రలో 50 ఓవర్లు స్పిన్నర్లతోనే వేయించిన తొలి జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది.
కాగా, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం విండీస్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు 74 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.