
న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill). కివీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాదే టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 2023లో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేశాడు.
ఇప్పటి వరకు టీమిండియా తరఫున 56 వన్డేలు, 28 టీ20లు, 39 టెస్టులు ఆడిన గిల్.. వన్డేల్లో 2785, టీ20లలో 705, టెస్టుల్లో 2839 పరుగులు సాధించాడు. బ్యాటర్‌గా తనను తాను నిరూపించుకున్న గిల్.. ఐదేళ్ల కాలంలోనే కెప్టెన్‌గానూ ఎదిగాడు.
ప్రస్తుతం టీమిండియా, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఉన్న గిల్.. టీ20 ఫార్మాట్లో వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. త్వరలోనే పొట్టి క్రికెట్‌లోనూ టీమిండియాను ముందుకు నడిపించనున్నాడు. మరి గిల్‌తో పాటే ఆయా ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఓ ఐదుగురు ప్లేయర్లు మాత్రం జాతీయ జట్టులో చోటు కోసం కనీసం పోటీపడే స్థితిలో కూడా లేకుండా పోయారు.

విజయ్ శంకర్ (Vijay Shankar)
గిల్‌తో పాటు 2019లో వన్డేల్లో అడుగుపెట్టాడు తమిళనాడు ప్లేయర్ విజయ్ శంకర్. 2019లో వన్డే వరల్డ్‌కప్ ఆడే సువర్ణావకాశం వచ్చిన దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి 223 పరుగులు చేయడంతో పాటు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.
ఆ తర్వాత కూడా పెద్దగా రాణించకపోవడంతో విజయ్ శంకర్‌కు టీమిండియా తలుపులు మూసుకుపోయాయి. ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన శంకర్ ఇక్కడా ఫెయిలయ్యాడు.

నవదీప్ సైనీ (Navdeep Saini)
వన్డేల్లో గిల్‌తో పాటే జాతీయ జట్టులో అడుగుపెట్టాడు నవదీప్ సైనీ. ఈ పేస్ బౌలర్ నిలకడలేమి ఆట కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు.ఫిట్‌నెస్ సమస్యలు కూడా వెంటాడటంతో కెరీర్ కష్టాలు తప్పడం లేదు.
టీమిండియా తరఫున రెండు టెస్టుల్లో నాలుగు, 8 వన్డేల్లో ఆరు, 11 టీ20లలో 13 వికెట్లు తీసిన ఈ హర్యానా రైటార్మ్ పేసర్.. 2021లో చివరగా టీమిండియాకు ఆడాడు.

టి.నటరాజన్ (T. Natarajan)
తమిళనాడుకు చెందిన టి.నటరాజన్ 2020-21 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. కానీ లెఫ్టార్మ్ పేసర్‌ను గాయాల బెడద వేధించడంతో త్వరగానే కనుమరుగైపోయాడు.
టీమిండియా తరఫున ఒక టెస్టు, రెండు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్.. ఆయా ఫార్మాట్లలో 3, 3, 7 వికెట్లు తీశాడు.

పృథ్వీ షా (Prithvi Shaw)
భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్. ఈ టోర్నీలో పృథ్వీ సారథ్యంలో గిల్ ఆడాడు. తర్వాత ఇద్దరూ ఒకేసారి టీమిండియాలోకి వచ్చారు.
ఓపెనింగ్ స్థానం కోసం జరిగిన పోటీలో గిల్ ముందుకు సాగిపోగా.. సచిన్ టెండుల్కర్ అంతటి వాడు అవుతాడనుకున్న పృథ్వీ కెరీర్ ఊహించని రీతిలో పతనమైంది.
క్రమశిక్షణారాహిత్యం, ఫిట్‌నెస్ సమస్యలు ఇందుకు కారణం. పాతికేళ్ల పృథ్వీ షా ఐదు టెస్టుల్లో 339, ఆరు వన్డేల్లో 189 పరుగులు సాధించాడు. ఆడిన ఒకే ఒక్క టీ20లో డకౌట్ అయ్యాడు. చివరగా 2021లో టీమిండియాకు ఆడాడు పృథ్వీ షా.

శివం మావి (Shivam Mavi)
గిల్‌తో కలిసి ఉత్తరప్రదేశ్ పేసర్ శివం మావి 2023లో అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు. ఈ ఫార్మాట్లో 26 ఏళ్ల గిల్ వైస్ కెప్టెన్‌గా ఎదగగా.. అదే ఏజ్‌లో ఉన్న శివం మాత్రం రెండేళ్ల క్రితమే తన చివరి మ్యాచ్ ఆడేశాడు. టీమిండియా తరఫున మొత్తంగా ఆరు టీ20లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్ ఏడు వికెట్లు తీయగలిగాడు.
చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషభ్ పంత్