ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునేందుకు చేరువయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టి నాలుగో స్ధానానికి చేరుకున్నాడు.
రాంచీ వన్డేలో సెంచరీతో సత్తాచాటడంతో కోహ్లి(751 రేటింగ్ పాయింట్లు) తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. విరాట్ కంటే ముందు ఇబ్రహీం జద్రాన్(764), డార్లీ మిచెల్(766 రేటింగ్ పాయింట్లు), రోహిత్ శర్మ(783) ఉన్నారు. అగ్రస్ధానంలో రోహిత్ కంటే విరాట్ ఇంకా కేవలం 33 రేటింగ్ పాయింట్లు మాత్రమే వెనకబడి ఉన్నాడు.
ప్రస్తుతం రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో కింగ్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడితే రోహిత్‌ను అధిగమించడం ఖాయం. రెండో వన్డేలో రోహిత్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.కాగా వన్డేల్లో కోహ్లి 2018 నుంచి 2021 వరకు దాదాపు మూడేళ్ల పాటు వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగాడు.
ఆ తర్వాత పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం.. కోహ్లి స్ధానంలో దూసుకొచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు కోహ్లి ఒక్కసారి కూడా వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఇప్పటికే టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కింగ్ కోహ్లి ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2027లో ఆడటమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.
చదవండి: అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్‌పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్


