దుబాయ్: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నమెంట్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. దోహా, ఖతర్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు రెండు గ్రూప్‌లుగా పాల్గొననున్నాయి.
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్’ పేరుతో
ఒమన్, పాకిస్తాన్, యూఏఈతో కలిసి భారత్ గ్రూప్ ‘బి’లో పోటీ పడుతుండగా... అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనున్నాయి. గతంలో ఏసీసీ ‘ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్’ పేరుతో నిర్వహించిన ఈ టోర్నీని ఈ సారి ‘రైజింగ్ స్టార్స్ టి20 టోర్నమెంట్’ పేరుతో నిర్వహించనున్నారు.
ఇందులో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన ‘ఎ’ జట్లు పాల్గొననుండగా... మిగిలిన మూడు అసోసియేట్ దేశాలైన హాంకాంగ్, ఒమాన్, యూఏఈ ప్రధాన జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ నెల 14 నుంచి 19 వరకు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున నిర్వహించనున్నారు.
నవంబర్ 16న
ఇందులో భాగంగా నవంబర్ 16న దాయాది పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 21న సెమీఫైనల్స్ నిర్వహించనుండగా... నవంబర్ 23న ఫైనల్ జరగనుంది. 2013 నుంచి ఎమర్జింగ్ టీమ్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ఆరంభంలో అండర్–23 జట్లు పోటీపడగా... ఆ తర్వాత ‘ఎ’ జట్లకు మార్చారు.
చివరిసారిగా 2024లో
ఇప్పటి వరకు పాకిస్తాన్, శ్రీలంక జట్లు రెండేసి సార్లు విజేతగా నిలవగా... భారత్, అఫ్గానిస్తాన్ ఒక్కోసారి ట్రోఫీ చేజిక్కించుకున్నాయి. చివరిసారిగా 2024లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో అఫ్గానిస్తాన్ విజేతగా నిలిచింది. ఒమన్‌లో జరిగిన టోర్నీ ఫైనల్లో శ్రీలంకపై అఫ్గాన్ విజయం సాధించింది.


