T20 Match: భారత్‌– శ్రీలంక జట్లు ముమ్మర ప్రాక్టీస్‌ | Indian women’s team has started practice for the T20I series | Sakshi
Sakshi News home page

T20 Match: భారత్‌– శ్రీలంక జట్లు ముమ్మర ప్రాక్టీస్‌

Dec 20 2025 11:44 AM | Updated on Dec 20 2025 12:00 PM

 Indian women’s team has started practice for the T20I series

విశాఖ స్పోర్ట్స్‌ : భారత్‌ – శ్రీలంక మహిళా జట్ల మధ్య టీ20 సిరీస్‌ కోసం రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌ ఆదివారం జరగనుండగా.. రెండో మ్యాచ్‌ 23న జరగనుంది. శుక్రవారం వైఎస్సార్‌ స్టేడియంలో ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేశాయి. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌ కప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు విశాఖ వేదికగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరగనుండగా మిగిలిన మూడు మ్యాచ్‌లు తిరువనంతపురంలో నిర్వహించనున్నారు. శ్రీలంక జట్టు ఈసారి యువ స్పిన్నర్లతో భారత్‌ను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా రెండు చేతులతోనూ స్పిన్‌ చేయగల సామర్థ్యం ఉన్న శశినితో పాటు కావ్య, రష్మిక వంటి యువ క్రీడాకారిణులు ఆ జట్టుకు అదనపు బలంగా మారారు. కెప్టెన్‌ చమరి ఆటతో పాటు ఇనోకా బౌలింగ్‌ కూడా లంకకు కీలకం కానుంది. బ్యాటింగ్‌ విభాగంలో ఇటీవల వరల్డ్‌ కప్‌లో రాణించిన హాసిని, విష్మి, హరిషత, నీలాక్షిక వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో శ్రీలంక పటిష్టంగా కనిపిస్తోంది.

బలంగా టీమిండియా
మరోవైపు భారత జట్టు కూడా సిరీస్‌ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా జట్టులో కీలక మార్పులు చేసింది. రాధ, యాస్టికా, నయాలి స్థానాల్లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కమలిని, స్పిన్నర్‌ వైష్ణవిలను తుది జట్టులోకి తీసుకుంది. ప్రాక్టీస్‌ సెషన్‌లో చురుగ్గా పాల్గొన్న వీరిద్దరూ విశాఖ వేదికగా టీ20 అరంగేట్రం చేయబోతున్నారు. భారత జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు దీప్తి, షఫాలీ, జెమిమా, రిచా వంటి స్టార్‌ క్రీడాకారిణులు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement