మరోసారి మెగా ఫైనల్లో భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. ఏసీసీ మెన్స్ ఆసియా కప్-2025 టోర్నీ టైటిల్ పోరులో దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలోని భారత్ 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే.
ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో 28 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన లంకను కాసేపు కెప్టెన్ విమత్ దిన్సార (32; 4 ఫోర్లు), చమిక హీనతిగల (42; 3 ఫోర్లు) ఆదుకున్నారు. ఇద్దరు తర్వాతి 6 ఓవర్ల పాటు వికెట్ పడనీయకుండా నాలుగో వికెట్‌కు 45 పరుగులు జతచేశారు.
ఆఖర్లో సేత్మిక సేనెవిరత్నే (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో లంక 130 పైచిలుకు స్కోరు చేయగలిగింది. యువ భారత ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (7), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 9)లు విఫలమయ్యారు. 25/2 స్కోరు వద్ద లంక పండగ చేసుకుంది.
విహాన్ మల్హోత్ర, ఆరోన్ జార్జ్ ధనాధన్
అయితే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్ర (45 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (49 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ శతకాలతో లంకేయుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇద్దరు జట్టును గెలిపించేదాకా క్రీజును అట్టిపెట్టుకోవడంతో లంక బౌలర్లు ఆపసోపాలు పడ్డారు.
అబేధ్యమైన మూడో వికెట్‌కు విహాన్, ఆరోన్ 114 పరుగులు జోడించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ విహాన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ ప్రాథమిక ధర రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా వర్షం వల్ల ఈ యూత్ వన్డేను 20 ఓవర్లకు కుదించారు.
పదకొండేళ్ల తర్వాత
ఇక మరో సెమీఫైనల్లో దుబాయ్‌లోని ది సెవెన్స్ స్టేడియంలో పాకిస్తాన్ కూడా 8 వికెట్ల తేడాతోనే బంగ్లాదేశ్‌పై గెలుపొందింది. వర్షం కారణంగా 27 ఓవర్లకు మ్యాచ్ కుదించగా.. బంగ్లాదేశ్ 26.3 ఓవర్లలో 121 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం 16.3 ఓవర్లలోనే పాకిస్తాన్ కేవలం రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించింది.
కాగా పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యువ చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ (అండర్–19లో) ఆసియా కప్ ఫైనల్లో తలపడనున్నాయి. చివరిసారిగా 2014లో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో పాక్‌ను ఓడించిన యువ భారత్ టైటిల్ సాధించింది. కాగా తాజా ఆసియా కప్ లీగ్ దశ మ్యాచ్‌లో భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.
వేదిక, టైమింగ్స్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే
భారత్- పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదిక. భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 నిమిషాలకు మ్యాచ్ మొదలు అవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (టీవీ), సోనీ లివ్ (డిజిటల్) యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం.
చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్‌కు శుభవార్త.. కెప్టెన్‌గా రిషభ్ పంత్


