కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని(Lionel Messi) కోల్‌కతా విజిట్ గందరగోళానికి దారితీసింది. తమ అభిమాన స్టార్ ప్లేయర్‌ను కళ్లారా చూడాలని తరలి వచ్చిన ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీని వీక్షించడానికి జనం వేలాదిగా చేరుకున్నారు. నిర్వహణ లోపంతో అభిమానులు నియంత్రణకోల్పోయి హింసకు దిగారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫలితంగా సాల్ట్ లేక్ స్టేడియం వెళ్లిన మెస్సీ కేవంల నిమిషాల్లో అక్కడ నుంచి వెళ్లిపోవడం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. రూ12 వేలు పెట్టి టికెట్ కొనుగోలు చేస్తే కనీసం తమ అభిమాన మెస్సీ మొఖాన్ని కూడా చూడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు మెస్సీ సమయాన్ని వృధా చేశారని అసహనం వ్యక్తం చేశారు.
#WATCH | Kolkata, West Bengal: A fan of star footballer Lionel Messi says, "It was really disappointing, we came all the way from Darjeeling for this... We couldn't even see him properly, and that was the most disappointing thing I have ever witnessed..." https://t.co/Ce4kNu8dBH pic.twitter.com/dgBSOIMEoG
— ANI (@ANI) December 13, 2025
డార్జిలింగ్ నుంచి వచ్చిన మహిళా అభిమాని, తాను రూ. 12,000 కు టికెట్ కొనుగోలు చేశానని, కానీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్న టాలిస్మాన్‌ను చూడలేకపోయానని ఆరోపించారు.
కాగా గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం తెల్లవారుజామున కోల్ కత్తాకు చేరుకున్నారు. మెస్సీ ఇండియాలో మూడు రోజులు పాటు, నాలుగు నగరాల్లో పర్యటించ నున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. అయితే మెస్సీ కోలక్‌తా టూర్ సందర్బంగా ఏర్పడిన గందరగోళంలో పట్టరాలి ఆగ్రహంతో అభిమానులు స్టేడియంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో సీట్లు ధ్వంసం చేశారు. గ్రౌండ్‌లోకి కుర్చీలు విరగ్గొట్టారు బారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు ఫ్యాన్స్ యత్నించారు. దీంతో జనాన్ని చెదర గొట్టడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అభిమానులు టెంట్‌ను మరియు గోల్ పోస్ట్‌ను కూడా ధ్వంసం చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.
మరోవైపు ఈ గందరగోళం నేపథ్యంలో GOAT ఇండియా టూర్ 2025 నిర్వాహకుడిని అరెస్టు చేసినట్టు అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ జావేద్ షమీమ్ వెల్లడించారు. కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. అంతేకాదు నిర్వాహకులు టికెట్ రుసుమును అభిమానులకు తిరిగి చెల్లిస్తారని కూడా హామీ ఇచ్చారు.


