రాశి కంటే వాసి ముఖ్యమని మన పెద్దలు అంటుంటారు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ అనేది దీని అర్థం. ఎంత పని చేశామనే దానికంటే ఎంత బాగా చేశావన్నదే ముఖ్యం. చదువు, ఉద్యోగాల్లో ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన సివిల్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంటే గ్రాడ్యుయేట్లే ఎక్కువగా విజయం సాధించారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గత ఐదు సంవత్సరాల డేటాను విశ్లేషిస్తే.. పీజీ చేసిన వారి కంటే డిగ్రీ పట్టభద్రులే ఎక్కువగా సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులయినట్టు తేలింది. ప్రణాళిక ప్రకారం ప్రిపేరయితే బ్యాచిలర్ డ్రిగీతోనే సివిల్స్ సాధించొచ్చని దీని ద్వారా నిరూపితమవుతోంది. యూపీఎస్సీ సివిల్ పరీక్షల్లో (UPSC CSE) గత మూడేళ్లలో మహిళల ఉత్తీర్ణత రేటు కూడా గణనీయంగా పెరిగింది. సబ్జెక్టుల వారీగా చూసుకుంటే ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించినట్టు ప్రభుత్వ డేటా వెల్లడించింది.
లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023లో సివిల్స్ పాసైన అభ్యర్థుల్లో 75% మందికి కేవలం బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే ఉంది. మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగిన వారు 25% మంది ఎంపికయ్యారు. గత ఐదేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2019 నుంచి 2023 వరకు మొత్తం 4,655 మంది అభ్యర్థులు సివిల్స్‌కు ఎంపికయ్యారు. వీరిలో 3,520 మంది గ్రాడ్యుయేట్లు (సుమారు 76%) ఉన్నారు. ఉన్నత విద్యార్హతలు లేకపోయినా.. పటిష్టమైన సన్నద్ధత, సరైన ప్రణాళిక ఉంటే సివిల్స్ పరీక్షలో విజయం సాధించవచ్చని దీన్నిబట్టి అర్థమవుతోంది.
గ్రాడ్యుయేట్ల హవా ఇలా..
2022: 1,020 మందిలో 765 మంది గ్రాడ్యుయేట్లు
2021: 748 మందిలో 585 మంది గ్రాడ్యుయేట్లు
2020: 833 మందిలో 650 మంది గ్రాడ్యుయేట్లు
2019: 922 మందిలో 672 మంది గ్రాడ్యుయేట్లు
అమ్మాయిలు పెరుగుతున్నారు
సివిల్స్‌లో మహిళల విజయం కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గత మూడేళ్లలో మహిళా అభ్యర్థుల ఉత్తీర్ణత రేటు పెరిగింది. 2019లో 24 శాతం మంది మహిళలు ఉత్తీర్ణత సాధించగా, గత మూడేళ్లలో ఇది 35 శాతంగా ఉంది. 2019లో 922 మంది సివిల్స్ సాధించగా, వీరిలో 220 మంది మహిళలు ఉన్నారు. 2024లో 1009 మంది సివిల్స్ పాసయితే వీరిలో 350 వరకు మహిళలు ఉన్నారు. అంతేకాదు టాప్ 5 ర్యాంకర్లలో ముగ్గురు అమ్మాయిలు ఉండడం విశేషం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శక్తి దూబే (Shakti Dubey) ఫస్ట్ ర్యాంక్ సాధించిన సంగతి తెలిసిందే.
ఇంజనీరింగ్ టాప్
ఏ స్ట్రీమ్ విద్యార్థులు యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో ఎక్కువగా పాసవుతున్నారనే ప్రశ్న ఎక్కువగా అడుగుతుంటారు. ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధిస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. 2023 ఫలితాల్లో ఇంజనీరింగ్ (49%), హ్యుమానిటీస్ (32%), సైన్స్ (12), మెడికల్: (6%) అభ్యర్థులు విజయం సాధించారు. గత కొనేళ్లుగా ఇదే తరహాలో ఫలితాలు వస్తున్నాయి. 2020 సివిల్స్ ఫలితాల్లో కూడా ఇంజనీరింగ్ అభ్యర్థులు 53 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచారు.


