సరిగ్గా ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ టైంలో తండ్రిని కోల్పోయాడు. అంతటి విషాదాన్ని దిగమంగి పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఇక ఆ తర్వాత చదువు కొనసాగించలేని దుస్థితి. కుటుంబ బాధ్యతలు మీద పడటంతో..కాలేజీ ముఖం చూడకుండానే..డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఆ తర్వాత పోస్టాఫీస్ క్లర్క్ ఉద్యోగం నుంచి మొదలు పెట్టి.. యూపీఎస్సీ వరకు మొత్తం 12 ప్రభుత్వ ఉద్యోగాలను కొల్లగొట్టి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. అనుకోని అవాంతరంలా హఠాత్తుగా వచ్చిపడే కష్టాలనే అభ్యున్నతికి సోపానంగా చేసుకుని ఎదగడం ఎలా అనేది చూపించి ప్రేరణగా నిలిచాడు.
అతడే ఐపీఎస్ సందీప్ చౌదరి. దృఢ సంకల్పం ఉన్నవారికి జీవితంలో ఓటమి ఉండదు అనేందుకు ఉదహారణ సందీప్ చౌదరి. చిన్న వయసులో తండ్రిని కోల్పోయాడు. సరిగ్గా ఇంటర్ బోర్డు పరీక్షల టైంలో తండ్రిని కోల్పోయాడు. ఆ దుఃఖాన్ని దిగమింగి..రాసి ఉత్తీర్ణుడయ్యాడు. చెప్పిరాని కష్టాన్ని ఓర్పుకుంటూ..మన గమనం ఆగిపోకూడదు అన్నట్లుగా..సందీప్ ముందుకు సాగిన తీరు ప్రశంసించదగ్గ విషయం.
ఆ తర్వాత కుటుంబ బాధ్యతల నిమిత్తమై రెగ్యులర్ కాలేజీ చదువుకి స్వస్తి పలికి దూరవిద్య ద్వారా చదవుని పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. అలా ఇగ్నో ఓపెన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ సాయంతో బీఏ, ఎంఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత పోస్టాఫీసులో పోస్టల్ క్లర్క్ ఎగ్జామ్‌కి దరఖాస్తు చేసుకున్నాడు. ఉన్నవి జస్ట్ 40 ఖాళీలు..దరఖాస్తు చేసుకుంది వందలాది మంది. అసలు నెగ్గుకురాగాలనా అనుకున్నాడు. కట్‌చేస్తే..కోచింగ్ లేకుండానే తొలి ప్రభుత్వ ఉద్యోగాన్ని కొల్లగొట్టి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు.
అలా అక్కడ నుంచి మొదలు పెట్టి..మహర్షి మూవీలో మహేశ్ బాబు డైలాగ్ సక్సెస్ ఈజ్ జర్నీ కామాలే ఉంటాయ్, పులిస్టాప్ ఉండదు అన్నట్లుగా సాగిపోయింది ఆయన విజయ పరంపర. ఆ తర్వాత ఎలాంటి కోచింగ్ లేకుండా మొత్తం పది ప్రభుత్వ పరీక్షలను క్లియర్ చేశాడు. వాటిలో బ్యాంక్ పీఓ, ఎస్‌ఎస్‌సీ, ఇన్‌కమ్ టాక్స్ ఇన్‌స్పెక్టర్, బీఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, నాబార్డ్, పంజాబ్ సివిల్ సర్వీసెస్ పరీక్ష తదితరాలు ఉన్నాయి.
సివిల్స్ ఎగ్జామ్ వైపుకి దృష్టి మళ్లింది అలా..
గుహతి అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తుండగా ఒక ఘట్టం అతడి జీవితాన్ని సివిల్స్ ప్రిపేరయ్యేందుకు పురిగొల్పింది. సరిగ్గా 2010 యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో తన రూమ్‌మేట్ 13వ ర్యాకు సాధించిడం చూసి..తాను ఆ ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్‌కి సన్నద్ధం కావాలని భావించాడు. అయితే సందీప్ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి పూర్తి నిబద్ధత అవసరం.
అందువల్ల యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం చాలా కష్టమైంది. అయినప్పటికీ..మిగతావాటికి ప్రిపేరయ్యినట్లుగానే తన శక్తి మేర కృసి చేశాడు. అలా 2014 యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే సందీప్ 158వ ర్యాంక్ సాధించాడు. ఇంటర్వ్యూలో మొత్తం 240 మార్కులు సాధించాడు.
అది ఆ సమయంలో దేశంలోనే అత్యధికమని సందీప్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారు కూడా. ప్రస్తుతం ఆయన జాతీయ దర్యాప్తు సంస్థలో(ఎన్‌ఐఏ) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)గా పనిచేస్తున్నారు. ఏదో సాధించేశాం హమ్మయ్య అనుకోలేదు..తకంటూ ఒక ప్రత్యేకతను చాటుకునేలా సక్సెస్ పరంపరను సాగించి.. ప్రపంచమే తనవైపు చూసేలా చేసుకుని "దటీజ్ సందీప్ చౌదరి" అనిపించుకున్నారు.


