ఐఏఎస్‌ అవ్వాలని ఎంతలా ప్రయత్నించాడంటే..! ఏకంగా 12 సార్లు.. | UPSC Aspirant Kunal Virulkar: 12 Attempts, 7 Mains, 5 Interviews — Still No Selection | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ అవ్వాలని ఎంతలా ప్రయత్నించాడంటే..! ఏకంగా 12 సార్లు..

Nov 13 2025 2:08 PM | Updated on Nov 13 2025 4:10 PM

The Most Heartbreaking IAS Story  12 Attempts 7 Mains 5 Interviews

పరాజయం అనగానే..ఫెయిల్యూర్స్‌ అని కాదు..పోరాడుతూ..ఉండేవాళ్లని. గెలుపు కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న గొప్ప యోధులు కూడా. ఎప్పుడు విజేతల విజయాలనే సెలబ్రేట్‌ చేసుకోవడం క, స్ఫూర్తిగా తీసుకోవడమే కాదు. ఓటమిని ఓర్చుకుంటూ సాగుతున్న పరాజితులు కూడా అంతకుమించిన మహామహులే. గెలుపు.. పొగరుని, అహంకారాన్ని అందిస్తే..ఓటమి ఓర్పు విలును నేర్పిస్తుంది. కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవడం ఏంటో తెలియజేస్తుంది. నిద్దురలో సైతం భయపెట్టించే ఓటమని ఒడిసిపట్టి గెలుపు శిఖరాన్ని అందుకోవడం కోసం తపించే పట్టువదలని విక్రమార్కులు. వాళ్ల అనుభవం విజేతలకు మించిన గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఎప్పుడూ సక్సెస్‌ని అందుకున్నవాళ్లని కాదు..విజయంకోసం ఆరాటపడుతూ..వెన్ను చూపకుండా చివ్వరి వరకు పోరాటం చేసే పరాజితులను కూడా అభినందిద్దాం, ప్రేరణగా తీసుకుందాం.! వాట్‌ ఇదేంటి అని అనుకోకండి..చక​ చక​ స్టోరీలోకి వెళ్లిపోదాం..

ఇంతవరకు సివిల్‌ సర్వీసెస్‌లలో గెలుపొందిన ఐఏఎస్‌ అధికారుల విజయ ప్రస్థానాన్ని అభినందించాం, స్ఫూర్తిగా తీసుకున్నాం. ఈ సారి ఐఏఎస్‌ కోసం చివ్వరి వరకు పోరాడి..లెక్కలేనన్ని ఓటములు చవి చూసినా..తన కథ కూడా మరొకరికి స్ఫూర్తిగా మారుతుందని చిరునవ్వుతో చెబుతున్న కునాల్‌ విరుల్కర్‌ ఫెయిల్యూర్‌ స్టోరీ ఏంటో చూద్దామా..!.

మొత్తం 12 ఏళ్లు యూపీఎస్సీకి తన లైఫ్‌ని అంకితం చేశాడు. ఒకటి, రెండు కాదు 12 సార్లు విఫలం. అయినా తనకు దొరికిన ప్రతి ఛాన్స్‌ని మిస్‌ చేయలేదు. గెలుపు తీరం అందుకునేదాక పోరాడేందుకు సంకల్పించిన అతడి తీరు ప్రశంసనీయం. సరిగ్గా 2012లో తొలి ప్రయత్నంలో ప్రిలిమినరీ పరీక్షలో తడబడ్డాడు. పోనీలే అని 2013లో మరోసారి ట్రై చేశాడు. ఈసారి ప్రిలిమ్స్‌ క్లియర్‌ చేసినా, మెయిన్స్‌లో ఓటమి తప్పలేదు. ఇదే పరిస్థితి 2014లో కూడా పునరావృతమైంది. 2015లో ఎట్టకేలకు మెయిన్స్‌ కూడా క్లియర్‌ చేశాడు. రెండింటిని దాటుకుని వచ్చినా ఇంటర్వ్యూలో ఓటమి పలకరించింది. 

పరాజయానికి కారణాన్ని విశ్లేషిస్తుండగా..52 మార్కుల తేడాతో ఇంటర్వ్యూని కోల్పోయానని తెలుసుకుని మరింత గట్టిగా ప్రయత్నించాడు. కానీ అప్పటికే నైరాశ్యం మనసుని కమ్మేయడంతో 2016, 2017 ప్రిలిమ్స్‌ చేధించలేక..మళ్లీ యథావిధిగా జీరో పొజిషన్‌కి చేరిపోయాడు. ఇక లాభం లేదనుకుని మరింత కసితో 2018లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈసారి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, రెండింటిని క్లియర్‌ చేసి.. నూతనోత్సాహంతో ఇంటర్వ్యూ దశకి చేరాడు. 

అయితే ఈసారి చవిచూసిన ఓటమి కంటిమీద కునుకప్టటనీయకుండా చేసింది. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో గెలుపు కనుచూప మేరలో కూడా లేదు, ఈసారి సక్సెస్‌కి ఒక్కడుగు దూరంలో సివిల్‌ సర్వీస్‌ అధికారిని అవ్వలేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అయినా అంత బాధను ఓర్చుకుంటూ..ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. అలా 2023 వరకు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండటం విశేషం. ఇంతలా ఓటమి తనను మట్టికరిపించినా..ఏ మాత్రం నైరాశ్యానికి తావివ్వలేదు..

జీవితం అంటేనే పోరాటం అంటూ అజేయమైన సంకల్పంతో ముందుకుపోతున్నాడు. అంతేగాదు..తాను సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌లో పొందిన అనుభవాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సోషల్‌ మీడియా వేదికగా తన పరాజయాల పరంపరను పంచుకున్నాడు. అది కూడా ఏడుస్తూ కాదు..సగర్వంగా కాన్ఫిడెంట్‌గా తాను చేసిన పోరాటాన్ని చెబుతుంటే..ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకున్నాయి, మనసు మెలిపెట్టేలా భావోద్వేగం చెదేలా చేసింది. ఇంతలా ఓటమి నీడలా వెంటాడుతున్నా..అంతలా స్థైర్యంగా చిరునవ్వుతూ ఉండటం అందరికీ సాధ్యం అయ్యే పనికాదు అంటూ నెటిజన్లు అభినందించారు. 

అంతేగాదు ఓటమిని అధిగమించి..లైఫ్‌ని ధైర్యంగా లీడ్‌ చేయడం ఎలా అనే విషయంలో గొప్ప మార్గదర్శకులు మీరే అని కునాల్‌ని అభినందించారు. ఇంజనీర్‌ గ్రాడ్యుయేట్‌ అయినా కునాల్‌ టీచర్‌గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ..ఔత్సాహిక సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థులకు తన వంతు సాయం అందిస్తున్నాడు. కునాల్‌ స్టోరీలో..ఓటమి పదే పదే పలకరించినా..పట్టువదలని విక్రమార్కుడిలా చేసినా అతడి ప్రయత్నాన్నికి కచ్చితంగా సెల్యూట్‌ చెప్పాల్సిందే కదూ..!. 
 

(చదవండి: Bhavya Narasimhamurthy on: అటు రాజకీయ నాయకురాలు.. ఇటు ఆర్మీ అధికారిగా..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement