అటు రాజకీయ నాయకురాలు.. ఇటు ఆర్మీ అధికారిగా..! | Lieutenant Bhavya Narasimhamurthy: From Politician to Territorial Army Officer | Sakshi
Sakshi News home page

Bhavya Narasimhamurthy on: అటు రాజకీయ నాయకురాలు.. ఇటు ఆర్మీ అధికారిగా..!

Nov 13 2025 12:23 PM | Updated on Nov 13 2025 1:30 PM

Lieutenant Bhavya Narasimhamurthy From Politician to Army

పాలన, రక్షణ రంగాలను వారధిగా చేసుకుని దేశ సేవ చేయాలనే ఆమె ద్వంద్వ వైఖరి అందరికి స్ఫూర్తిదాయకం. ఇది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, దేశానికే గర్వకారణం కూడా. సింపుల్‌గా చెప్పాలంటే బహువిధ మార్గాల్లో దేశానికి సేవ చేయడం అంటే ఏంటో యువతకు ప్రేరణని ఇచ్చారామె. మరి ఇలా రెండు రకాలుగా దేశానికి సేవలందిస్తున్న ఆమె విజయ ప్రస్థానం ఎలా సాగిందో తెలుసుకుందామా.

కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగిన భవ్య నరసింహమూర్తి(Bhavya Narasimhamurty) గతేడాది టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఇటీవట గత మూడు నెలలుగా డెహ్రాడూన్‌లోని  ప్రతిష్టాత్మక ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. దీంతో ఆమె ప్రతి ఏడాది ఒక నిర్దిష్ట కాలానికి లెఫ్టినెంట్ హోదాలో భారత సైన్యంలో సేవలందిస్తూనే ఉంటారామె. అంతేగాదు భవ్య దక్షిణ భారతదేశం నుంచి మొదటి మహిళా టెరిటోరియల్ ఆర్మీ (TA) అధికారిగా ఘనత సృష్టించింది. ఇది నిజంగా భారత సైనిక చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయి. 

రాజకీయ ప్రస్థానం..
భవ్య నరసింహమూర్తి 2020లో అధికారికంగా భారత జాతీయ కాంగ్రెస్ (INC)లో చేరారు. ఆ తర్వాత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రతినిధిగా , టెలివిజన్ చర్చలలో సుపరిచితమైన వ్యక్తిగా మారింది. పార్టీ విధానాలను ఉద్రేకంతో సమర్థిస్తూ, ప్రతిపక్షాలను విమర్శించేది. ఆమె స్పష్టమైన వాదనలు  సామాజిక సమస్యలపై లోతైన అవగాహన తదితరాలు భవ్యను కర్ణాటక రాజకీయ రంగంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. 

అలా ఆమెను 2023లో AICC సోషల్ మీడియా అండ్‌ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల జాతీయ సమన్వయకర్తగా నియమించింది. ఈ పదవి ఆమెకు డిజిటల్ కమ్యూనికేషన్‌లో తనకున్న నైపుణ్యంతో పార్టీ ఆన్‌లైన్ ఉనికిని రూపొందించి ఓటర్లతో సన్నిహితంగా ఉండటానికి, అలాగే ప్రగతిశీల భారతదేశం కోసం కాంగ్రెస్ దార్శనికతను ప్రోత్సహించడానికి వీలు కల్పించింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో, భవ్య రాజాజీనగర్ నియోజకవర్గం టికెట్ కోసం బలమైన పోటీదారుగా నిలిచింది.

అలా ఆర్మీవైపు అడుగులు..
ఆమె 2022లో కఠినమైన టెరిటోరియల్ ఆర్మీ (TA) ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. ఆ ఏడాది ఎంపికైన ఏకైక మహిళా అభ్యర్థిగా భవ్య నిలిచింది. మే 2024లో, ఆమెను ఇండో-పాక్ నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని ఆర్మీ యూనిట్‌కు నియమించారు. అక్కడ ఆమె ఇంటెన్సివ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని, లెఫ్టినెంట్‌గా నియమితురాలైంది. 

రాజకీయాల నుంచి సైన్యంలోకి ఆమె తీసుకున్న యూటర్న్‌.. జాతీయ సేవపట్ల తనకున్న బహుముఖ నిబద్దతను తెలియజేస్తోంది. ఇలా పౌరులు తమ వృత్తిపరమైన కెరీర్‌ల తోపాటు ఆర్మీలో సేవ చేయడానికి వీలు కల్పించే టెరిటోరియల్ ఆర్మీ,భారతదేశ రక్షణకు తోడ్పడటానికి భవ్యకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించింది. ఇలా టెరిటోరియల్‌ ఆర్మీ ఆపీసర్‌గా క్రికెటర్ ఎంఎస్ ధోని, రాజకీయ నాయకుడు సచిన్ పైలట్ వంటి ప్రముఖ వ్యక్తులు ఎందరో భాగమయ్యారు. 

కానీ దక్షిణ భారతదేశం నుంచి తొలి మహిళగా భవ్య సాధించిన విజయం సైన్యంలో చేరాలనుకునే ఎందరో ఔత్సాహిక మహిళలకు ప్రేరణగా నిలుస్తుంది. ఇక భవ్య నరసింహమూర్తి కూడా సోషల్‌ మీడియా ఎక్స్‌లో తన అనుభవాన్ని షేర్‌ చేస్తూ.."ఈ ఆర్మీ శిక్షణ చాలా సవాలుతో కూడుకున్నది, పైగా గొప్ప అసాధారణ అనుభవాన్ని అందించింది. 

ముఖ్యంగా నా శారీరక బలాన్ని, మానసిక ప్రశాంతతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది." అని భవ్య పోస్ట్‌లో రాసుకొచ్చారామె. అంతేగాదు తాను భారత సైన్యంలో అధికారిగా, అలాగే రాజకీయ నాయకురాలిగా నా మాతృభూమికి సేవ చేయగలిగే అద్భుతమైన అవకాశాన్ని అందించిన ఆ భగవంతుడుకి సదా కృతజ్ఞతలు అని పోస్ట్‌ని ముగించిందామె. 

 

(చదవండి: రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్‌ స్టోరీ)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement