లిస్ట్-ఏ క్రికెట్‌లో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) హవా కొనసాగుతోంది. 34 ఇన్నింగ్స్‌ల స్వల్ప కెరీర్‌లో 11వ శతకం (12 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి) నమోదు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఈ ఆర్సీబీ బ్యాటర్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ చేసి ఔరా అనిపించాడు.
తొలి మ్యాచ్‌లో జార్ఖండ్‌పై వీరోచిత శతకం (118 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 147 పరుగులు) బాదిన పడిక్కల్.. తాజాగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ అదే తరహా ప్రదర్శన రిపీట్ చేశాడు. తన జట్టు 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో సెంచరీ పూర్తి చేసుకొని ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు (135 బంతుల్లో 123 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు).
అతనికి జతగా మరో టీమిండియా ఆటగాడు కరుణ్ నాయర్ క్రీజ్‌లో ఉన్నాడు. కరుణ్ (98 బంతుల్లో 93 నాటౌట్; 10 ఫోర్లు) కూడా సెంచరీకి చేరువగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కర్ణాటక గెలవాలంటే 60 బంతుల్లో మరో 65 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. 40 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 220/1గా ఉంది. కర్ణాటక కోల్పోయిన ఒకే ఒక వికెట్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ది (1).
అంతకుముందు బాబా అపరాజిత్ (71), అజారుద్దీన్ (84 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించడంతో కేరళ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహన్ కున్నుమ్మల్ 12, అభిషేక్ నాయర్ 7, అహ్మద్ ఇమ్రాన్ డకౌట్, అకిల్ స్కారియా 27, విష్ణు వినోద్ 35, అంకిత్ శర్మ 2, నిధీశ్ 34 (నాటౌట్) పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో అభిలాశ్ షెట్టి 3 వికెట్లు పడగొట్టగా.. శ్రేయస్ గోపాల్ 2, విధ్వత్ కావేరప్ప, విద్యాదర్ పాటిల్ తలో వికెట్ తీశారు.
జార్ఖండ్‌పై వీరోచిత శతకం
పడిక్కల్ ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లో జార్ఖండ్‌పై వీరోచిత శతకం బాదాడు. 413 పరుగుల అతి భారీ లక్ష్య ఛేదనలో ఈ భారీ సెంచరీ చేసి తన జట్టు గెలుపుకు గట్టి పునాది వేశాడు.
లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఇది రెండో భారీ లక్ష్య ఛేదనగా.. విజయ్ హజారే టోర్నీ చరిత్రలో భారీ లక్ష్య ఛేదనగా రికార్డైంది. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అతి భారీ లక్ష్య ఛేదన రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 435 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించింది.


