ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది! | Woman Takes Stand Against Harassment During Bengaluru Metro Ride, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది!

Dec 27 2025 8:40 AM | Updated on Dec 27 2025 9:47 AM

Woman Recounts Harassment During Metro Ride

ఆఫీస్‌ అయ్యాక మెట్రో రైలులో ఆ యువతి తాను ఉంటున్న ప్లేస్‌కు బయల్దేరింది. రద్దీలో ఎలాగోలా సీటు సంపాదించుకుని ఇద్దరు మగాళ్ల మధ్య కూర్చోగలిగింది. ఈలోపు.. తన పక్కన కూర్చన్న వ్యక్తి దిగిపోయి.. మరొకతను ఎక్కాడు. నెమ్మదిగా అతనిలోని కామోన్మాది బయటపడ్డాడు. ఒక్క నిమిషం ఆమెకు గుండె ఆగినంత పనైంది. అయితే ఆ వెంటనే ధైర్యం తెచ్చుకున్న యువతి ఆ మృగాడి చెంపలు చెడామడా వాయించింది.

డిసెంబర్ 23 సాయంత్రం నమ్మా మెట్రో(బెంగళూరు) ప్రయాణిస్తున్న ఒక యువతి, తనకు ఎదురైన లైంగిక వేధింపుల ఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘నా ప్రయాణం అప్పటిదాకా సాఫీగా సాగింది. మధ్యలో పక్కన కూర్చున్న ప్రయాణికుడు దిగిపోవడంతో, మరో వ్యక్తి వచ్చి పక్కన కూర్చున్నాడు. నా మీద పడడం, శరీర భాగాలకు తాకడంతో ఇబ్బంది పడ్డా. అయితే రద్దీ కాబట్టి యాదృచ్ఛికమని భావించా. ఈలోపు.. అతని తీరు మారింది. కావాలనే చేస్తున్నాడని అర్థమైంది. ఇదేమిటన్నట్లు చూస్తే వెకిలినవ్వులు నవ్వాడు. ఇంతలో.. 

నేను దిగాల్సిన స్టేజ్‌ వచ్చింది. అతను మరికొందరిని కూడా ఇలాగే వేధించే అవకాశం ఉందని భావించా. అతని చెంప పగలకొట్టి లేవమన్నా. స్టేషన్‌ బయటకు వచ్చాక మరోసారి చెంప పగలకొట్టా. కెంపగౌడ మెట్రో స్టేషన్‌ సెక్యూరిటీ సిబ్బంది అది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు సర్దుకుపోవాల్సిన అవసరం ఏ అమ్మాయికీ లేదు’’ అంటూ ఆమె వీడియో ఉంచింది. 

ఈ ఘటనపై ఆ యువతి ఉప్పారపేట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అతని పేరు ముత్తప్ప (48) అని తెలిసింది. తర్వాత తప్పయిపోయిందంటూ అతడు యువతి  పాదాలపై పడి క్షమాపణలు చెప్పాడు. యువతి అంగీకరించడంతో అతనిని మందలించి పంపించివేశారు. లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్న యువతిపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement