చిన్నప్పటినుంచీ తండ్రి వ్యాపారాన్ని చూస్తూ పెరిగింది. ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికీ, కుటుంబ వ్యాపారంపై పెద్దగా ఆసక్తి లేదు. అందుకే దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఒకరోజు అనుకోకుండా కుల్ఫీ మేకింగ్‌లో ప్రయోగం చేసింది. అంతే అక్కడినుంచి ఆమె జీవితం, ఆలోచన మారి పోయింది. కట్ చేస్తే కోటి రూపాయలు ఆర్జించే బిజినెస్‌కు యజమానిగా మారిపోయింది. ఎవరామె? ఏమా సక్సెస్ జర్నీ. తెలుసుకుందామా
ఢిల్లీకి చెందిన సమత బోత్రా(Samta Bothra) సగటు అమ్మాయి మాదిరిగా పెళ్లి చేసుకుని భర్త, పిల్లా పాపాలతో ఆనందంగా జీవితాన్ని సాగిస్తోంది. అలాదాదాపు మూడు దశాబ్దాలు గడచిపోయాయి. 2018లో హోలీ పండుగ సందర్బంగా సరదాగా కుల్ఫీ తయారు చేసింది. అందరికి తెగ నచ్చేసింది. ఇంటికొచ్చిన బంధువులకు కూడా రుచి చూపించింది. అంతే అలాంటి కుల్పీ కావాలని బంధువులు మళ్లీ మళ్లీ అడగడం మొదలు పెట్టారు. దీంతో దీన్నే వ్యాపారంగా ఎందుకు మలుచుకోకూడదనే ఆలోచన 51 ఏళ్ల సమత మదిలోవచ్చింది.
తన కొడుకు సహాయంతో, సమతా కేవలం మూడు రుచులతో ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టింది సమత. ఇంట్లో నుండే రబ్రీ, గులాబీ , కేసర్ కుల్ఫీ ఆర్డర్స్ మీద తయారు చేసింది. కేవలం రూ.5 వేలతో మమ్మీస్ కుల్ఫీ మొదలైంది. అలా ప్రారంభ రోజుల్లో ఆర్డర్‌ల సంఖ్య చాలా తక్కువగా అంటే రెండు రోజులకు ఒక ఆర్డర్ వచ్చేవి. స్నేహితులు ,బంధువుల తదితరుల ద్వారా దీనికి మరింత ప్రచారం లభించింది. అలా ఆదరణ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆరేడు నెలల తర్వాత రెగ్యులర్‌గా కుల్ఫీల కోసం ఆర్డర్ట్ మొదలైనాయి. దీంతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. దీంతో డిమాండ్ మరింత పుంజుకుంది. ప్రతి రోజు 60 నుంచి 70 దాకా ఆర్డర్లు వచ్చేవి.కార్పొరేట్ కంపెనీలు సైతం మమ్మీస్ కుల్ఫీలకు ఆర్డర్లు ఇచ్చేవారు. జొమాటోతో భాగస్వామ్యం కార్పొరేట్‌ల కోసం ఒకేసారి 2000 - 3000 కుల్ఫీ బల్క్ ఆర్డర్‌లు వచ్చేవి. మెట్ లైఫ్ , భారతి ఎయిర్‌టెల్‌తో సహా అనేక ఇతర కంపెనీలలో కుల్ఫీ స్టాల్‌లను కూడా ఏర్పాటు చేసింది.
రూ. 5వేల నుంచి కోటి టర్నోవర్ దాకా
డిమాండ్ బాగా పెరగడంతో రిటైల్ బిజినెస్‌లోకి కూడా ప్రవేశించింది సమత. ఈస్ట్ ఢిల్లీలోని కృష్ణా నగర్‌లో మమ్మీ కుల్ఫీ షాప్‌ను తెరించింది. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేదు. మమ్మీ కుల్ఫీ రుచికి, నాణ్యతకు వినియోగదార్లు ఫిదా అయిపోయారు. దీంతో తరువాత ఏడాదికే మరో షాపును ఓపెన్ చేసే స్థాయికి చేరింది. ఇపుడు ఏడాదికి కోట రూపాయల టర్నోవర్‌ను సాధించింది. అన్నీ సహజ, సేంద్రీయ పదార్థాలతో తయారు చేస్తామని చెబుతున్నారు సమత. ఒక్క ఐడియాతో తన జీవితాన్ని మార్చేసుకుని తన లాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది సమత. సక్సెస్‌కు వయసుతో సంబంధం లేదని ఓర్పు, సహనం, మార్కెటింగ్ టెక్నిక్ తెలిస్తే చాలని చాటి చెప్పింది.


